×
Ad

Freebies: ఇదేం సంస్కృతి? దేశం ఎటుపోతోంది? మేలుకోవాల్సిన సమయం వచ్చింది..! ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్

దేశంలోని చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలే. అయినప్పటికీ అభివృద్ధిని విస్మరిస్తూ ఉచితాలను అందిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

  • Published On : February 19, 2026 / 06:28 PM IST

Supreme Court Representative Image (Image Credit To Original Source)

  • ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
  • ప్రజల జీవితాలను మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలకు హితవు
  • ఉచితాలపై కాదు అభివృద్ధి ప్రాజెక్టులపై ఖర్చు చేయాలని సూచన

Freebies: ఆ స్టేట్, ఈ స్టేట్ అని కాదు.. ఇండియాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అదే సీన్. ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఇదే నామజపం చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఆ పార్టీ ఈ పార్టీ అనే మాట లేదు.. అన్ని పార్టీలది ఉచితాల బాటే. ఎన్నికల్లో ప్రజలను అట్రాక్ట్ చేసేందుకు రాజకీయా పార్టీలు ఉచితాల నామజపం చేస్తున్నాయి. ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఉచితాల ప్రకటనలో ఒకదానికి మించి మరొకటి పోటీ పడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వస్తున్న ఆదాయం ఎంత.. ఇలాంటి ముఖ్యమైన వివరాలేవీ రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు.

నోటికి వచ్చినట్లుగా ఉచిత హామీలు ఇచ్చేస్తున్నాయి. వారి లక్ష్యం అంతా ఒక్కటే. అధికారంలోకి రావడం. పవర్ లోకి వచ్చాక ఆ హామీలు నెరవేర్చేందుకు భారీగా అప్పులు చేసేస్తున్నారు. రాష్ట్రాలను అప్పులకుప్పగా మారుస్తున్నారు. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. దీంతో ఉచితాల అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలపై అసహనం వ్యక్తం చేసింది. ఇదేం సంస్కృతి? అంటూ ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది.

ఉచితాలతో ఆర్థికాభివృద్ధికి ఆటంకం..

రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు “ఉచిత సంస్కృతి”ని పంపిణీ చేయడం, ప్రోత్సహించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ఇది ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి విధానాలను పునః సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తేల్చి చెప్పింది. అటువంటి పథకాల ద్వారా వనరులను పంపిణీ చేయడానికి బదులుగా, ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని, ప్రణాళికాబద్ధమైన విధానాలను ప్రవేశపెట్టాలని రాజకీయ పార్టీలకు హితవు పలికింది.

ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ హామీని ప్రతిపాదించిన డీఎంకే ప్రభుత్వం నేతృత్వంలోని తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. రాష్ట్రాలు పేదలకు మద్దతివ్వాలని ఎంచుకుంటే అది అర్థమయ్యేదేనని పేర్కొంది.

ప్రజల జీవితాలు మెరుగుపరిచే పథకాలు కావాలి..

అటువంటి పథకాల ద్వారా వనరులను పంపిణీ చేయడానికి బదులుగా, నిరుద్యోగ పథకాలు వంటి ప్రజల జీవితాలను మెరుగుపరిచే చర్యలను అందించే ప్రణాళికాబద్ధమైన విధానాలను ప్రవేశపెట్టాలని రాజకీయ పార్టీలకు సూచించింది సుప్రీంకోర్టు. దేశంలోని చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలే అయినప్పటికీ అవి అభివృద్ధిని విస్మరిస్తూ ఉచితాలను అందిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

“ఈ రకమైన పెద్ద మొత్తంలో పంపిణీ చేయడం వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ప్రజలకు పథకాలు అందించడం రాష్ట్రాల విధి. కానీ ఉచితాలను అనుభవిస్తున్న వారు.. ఇది పరిశీలించాల్సిన విషయం కాదా?” అని CJI సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. “రాష్ట్రాలు లోటులో నడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఉచితాలను ఇస్తున్నాయి. ఒక సంవత్సరంలో మీరు సేకరించే ఆదాయంలో 25 శాతం రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు ఉపయోగించకూడదు?” అని ఆయన ప్రశ్నించారు.

ఈ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ సంబంధించినదని సుప్రీంకోర్టు పేర్కొంది. “మనం మాట్లాడుతున్నది ఒక రాష్ట్రం గురించి కాదు, అన్ని రాష్ట్రాల గురించి. ఇది ప్రణాళికాబద్ధమైన వ్యయం. మీరు బడ్జెట్ ప్రతిపాదనలు చేసి, ఇది ప్రజల నిరుద్యోగంపై నా వ్యయం అని ఎందుకు సమర్థించుకోరు?” అని జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి అన్నారు. అసలు మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాము? అని సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.

రాష్ట్రాలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికి బదులుగా, రెండు పనులు చేస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. జీతాలు చెల్లించడం, అలాంటి ప్రయోజనాలను పంపిణీ చేయడం అని వ్యాఖ్యానించింది.

“భారత్ లో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాము? సంక్షేమ చర్యలో భాగంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని వారికి అందించాలనుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ భరించగల వారికి, భరించలేని వారికి మధ్య తేడాను గుర్తించకుండా, మీరు పంపిణీ చేయడం కరెక్టేనా? అని CJI ప్రశ్నించారు.

Also Read: EPFO పెన్షన్‌పై బిగ్ అప్‌డేట్ : ఉద్యోగులకు ఇక ఫుల్ శాలరీతో ఎక్కువ పెన్షన్, వారికి మాత్రమే బెనిఫిట్!