Supreme Court: పటాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఇష్టారాజ్యంగా కాల్చితే చర్యలు.. కేంద్రానికి, సిపిసిబికి సీరియస్ ఆదేశాలు!
దీపావళి టపాసుల (Supreme Court)వినియోగం, పర్యావరణ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక వ్యాఖ్యలు చేసింది.
- V Santhosh Kumar
- Published on- September 30, 2026 / 01:45 PM IST
Supreme court refuses complete ban on firecrackers diwali rules
Supreme Court: దేశవ్యాప్తంగా పండుగల వేళ దీపావళి టపాసుల వినియోగం, పర్యావరణ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక వ్యాఖ్యలు చేసింది. టపాసుల అమ్మకాలు, వినియోగంపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించాలన్న ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. టపాసులపై పూర్తిగా నిషేధం విధిస్తే కొన్ని ప్రత్యేక వర్గాల ప్రజల మతపరమైన భావాలు, ఆచార వ్యవహారాలు దెబ్బతినే అవకాశముందని సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
నియంత్రణలు తప్పనిసరి.. 24 గంటల పటాకుల మోతకు బ్రేక్:
పూర్తి నిషేధానికి నై అన్నప్పటికీ, 24 గంటల పాటు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా టపాసులు(Supreme Court) కాల్చడాన్ని ఎంతమాత్రమూ అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అనియంత్రిత కాలుష్యం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేసింది. ఈ సమస్యను అరికట్టేందుకు పటాకులు కాల్చడానికి నిర్దిష్ట సమయ వేళలను నిర్ణయించడంతో పాటు, ఏ రకమైన పర్యావరణ అనుకూల (గ్రీన్) టపాసులను మాత్రమే ఉపయోగించాలో త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించింది.
సిపిసిబికి మరికొంత సమయం.. విచారణ అక్టోబర్ 15కు వాయిదా:
కాగా, టపాసుల్లో ఉపయోగించే ప్రమాదకర బేరియం రసాయనాల పరీక్షలు, జాయింట్ ఫైర్‌క్రాకర్ టెస్టింగ్‌లు, శబ్ద తీవ్రతకు సంబంధించిన డెసిబెల్ స్థాయిల నివేదికలను సమర్పించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB), కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరికొంత గడువు మంజూరు చేసింది. సైంటిఫిక్ నివేదికలను పరిశీలించిన అనంతరం తదుపరి సమగ్ర ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంటూ ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.
