శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై జనవరి 13 నుంచి విచారణ

  • Publish Date - January 8, 2020 / 10:46 AM IST

శబరిమల  ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై విచారించటానికి  ఏర్పటైన 9 మంది జడ్జిల ధర్మాసనం జనవరి 13 నుంచి విచారణ చేపట్టనుంది. దీనికి సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వం వహిస్తారు.

కేరళలోని పతనందిట్ట జిల్లాలోని 800 ఏళ్లనాటి అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  ఐదుగురు న్యాయమూర్తులు గల ఈ ధర్మాసనంలో… మహిళలపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నలుగురు న్యాయమూర్తులు మొగ్గుచూపగా ఒకరు వ్యతిరేకించారు. 

అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.  ఈ రివ్యూ పిటీషన్వలు విచారించటావికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి,, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉంటారు.

2018 సెప్టెంబర్ 28న శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో…. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా వెళ్లి పూజలు చేయొచ్చని తీర్పు ఇచ్చింది. అంతకుముందు ఈ ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై  కొన్నిశతాబ్దాలుగా నిషేధం ఉంది. శ

బరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీం  తీర్పు తర్వాత కొందరు మహిళలు ఆలయంలో వెళ్ళటానికి ప్రయత్నిస్తే భక్తులు, ఆందోళనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒకటి రెండు ప్రయత్నాల తరువాత చివరకు పోలీసుల సహాయంతో తొలిసారి ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గలు 2019 జనవరి 2న ఆలయంలోకి వెళ్లగలిగారు. వారి ప్రవేశం తరువాత ఆలయాన్ని శుద్ధి కోసం మూసివేశారు. గంటపాటు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచారు.