Tamil Nadu Politics : విజయ్ పీఎం అంటూ ప్రచారం.. టీవీకే సర్కార్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కాంగ్రెస్..!

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ రాష్ట్రంలో అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీపై మిత్రపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

Rahul Gandhi and Joseph Vijay

Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ రాష్ట్రంలో అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీపై మిత్రపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. అయితే, టీవీకే మంత్రులు మాత్రం కాబోయే ప్రధాని జోసెఫ్ విజయ్ అంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో టీవీకే మంత్రుల వ్యవహారం కాంగ్రెస్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పించింది.

Also Read : Veligonda Project : వెలిగొండ.. కరవు నేలకు జలకొండ..! కృష్ణమ్మ పరుగులతో 30ఏళ్ల కల సాకారం.. మారనున్న మూడు జిల్లాల రూపురేఖలు

2029 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే.. ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న మేమంతా రాజీనామా చేస్తామని కాంగ్రెస్ మంత్రులు హెచ్చరించారు. ఈ క్రమంలో తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఎస్. రాజేశ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ భావిస్తోందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే.. తమిళనాడు ప్రభుత్వంలోని కాంగ్రెస్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందని రాజేశ్ కుమార్ హెచ్చరించారు. మరో కాంగ్రెస్ మంత్రి పి. విశ్వనాథన్ కూడా రాహుల్ గాంధీనే 2029కు ఇండియా కూటమి ప్రధాని ఎంపిక అని ఇటీవల స్పష్టం చేశారు.

ఇటీవల విడుదలైన ఇండియా టుడే సర్వేలో విజయ్ ప్రధాని అభ్యర్థిగా మూడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది. అప్పటి నుంచి టీవీకే మంత్రులు కాబోయే ప్రధాని విజయ్ అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా ద్వారా కాబోయే పీఎం విజయ్ అంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలు టీవీకే సర్కార్ లో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒకపక్క ఇండియా కూటమి తరపున కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంటే.. మరోవైపు టీవీకే మంత్రులు మాత్రం విజయ్ కాబోయే ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారం చేస్తుండటం ఏమిటని కాంగ్రెస్ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో టీవీకే అధిష్టానంకు వార్నింగ్ ఇచ్చారు. మీ పద్దతి మార్చుకోకపోతే.. ప్రభుత్వం నుంచి తప్పుకుంటామంటూ కాంగ్రెస్ మంత్రులు హెచ్చరిక చేశారు.

మొత్తంగా చూస్తే.. 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తమిళనాడులో మిత్రపక్షాల మధ్య ప్రధాని అభ్యర్థి విషయంలో ఇప్పటి నుంచే విభేదాలు మొదలైనట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ మంత్రుల హెచ్చరికల తరువాత కూడా.. రాహుల్ గాంధీకి తమ మద్దతు ఉంటుందని టీవీకే ప్రకటిస్తుందా? లేదంటే విజయ్‌ను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే వ్యూహాన్నే కొనసాగిస్తుందా? అన్నది ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.