ఇది తింటే చాలట : కరోనా వైరస్ కు మందు కనిపెట్టామంటున్న హోటల్ ఓనర్

  • Publish Date - February 3, 2020 / 07:53 AM IST

చైనాలోని(china) వుహాన్(wuhan) నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్(coronaviurs) ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ తో మనుషులు పిట్టలా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి. దాదాపుగా 15వేలమంది ఈ వైరస్ బారిన పడినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ 17 దేశాల్లో వ్యాపించినట్టు సమాచారం. చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా వైరస్ కి ఇంటవరకు ట్రీట్ మెంట్ లేదు. ఇక వ్యాక్సిన్ సంగతి దేవుడెరుగు. వైరస్ ని ఎలా నయం చేయాలో అర్థం కాక డాక్టర్లు, సైంటిస్టులు తలలు పట్టుకున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున టెస్టులు జరుగుతున్నాయి. 

ఇలా కరోనాకు యావత్ ప్రపంచం వణికిపోతుంటే.. తమిళనాడు కరైకుడికి చెందిన ఓ హోటల్ ఓనర్ మాత్రం కరోనాకు మందు కనిపెట్టామని చెబుతోంది. ఇంతకీ వారు చెబుతున్న మందు ఏంటో తెలుసా.. ఊతప్పం..(uthappam) అవును.. దోశ పిండితో చేసే ఊతప్పం గురించి తెలియని వారు ఉండరు. మా అల్పాహారంతో కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని హోటల్ నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.

తమ హోటల్ లోని ఊతప్పం తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరిస్తున్నారు. సిద్దా ఆయుర్వేదిక్ పద్దతి ప్రకారం చిన్న ఉల్లిపాయల్లో ఫ్లూ లాంటి వ్యాధులు దర చేరనివ్వకుండా రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఆ ఉల్లిపాయలతో మేము చేసే ఊతప్పం తింటే కరోనా వైరస్ సోకదని ప్రకటనలు ఇస్తున్నారు.

” మా ‘ఊతప్పం’ తినడం వల్ల కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. నువ్వుల నూనె, చిన్న ఉల్లిపాయలతో చేసిన ఊతప్పం.. కరోనా వైరస్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. సిద్ధ ఔషధం విధానం ప్రకారం, చిన్న ఉల్లిపాయలు ఫ్లూ ఆధారిత వ్యాధులను అడ్డుకుంటాయి. కాబట్టి, మేము మా హోటల్ కు వచ్చే కస్టమర్లకు చిన్న ఉల్లిపాయలతో కూడిన ఊతప్పాన్ని అందిస్తున్నాము” అని హోటల్ నిర్వాహాకులు వివరించారు. దీనిపై ఓ ప్రకటన ఇస్తూ హోటల్ ముందు బోర్డు కూడా పెట్టారు.

కరోనాకు మందు ఉతప్పం.. అంటూ టిఫిన్ సెంటర్ నిర్వాహాకులు చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇది మరీ టూ మచ్ అని కామెంట్ చేస్తున్నారు. హోటల్ ప్రచారం కోసం, బిజినెస్ పెంచుకోవడానికి.. ఇలా చీప్ పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడుతున్నారు. కరోనా వైరస్ కు మందు కనిపెట్ట లేక పెద్ద పెద్ద సైంటిస్టులే తలలు పట్టుకుంటుంటే.. టిఫిన్ తో వైరస్ రాదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా పబ్లిసిటీ తప్ప మరొకటి కాదని అభిప్రాయపడ్డారు.