Tenth Exam Fee
Tenth Exam Fee only allowed if Named in NR : పదో తరగతి చదివే విద్యార్థుల పేర్లు నామినల్ రోల్స్ జాబితాలో(ఎన్‌ఆర్) ఉంటేనే పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతిస్తారు. ఇది ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. జాబితాలో లేని పేర్లను నమోదు చేయడానికి మంగళవారం వరకు అవకాశం కల్పించారు. ఆ గడువు మరో 24 గంటల్లో ముగియనుంది. ఈ మార్పు, చేర్పులు కేవలం డీఈఓ లాగిన్‌లో మాత్రమే చేసుకునేలా అవకాశమిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి రావటమో లేదా రాతపూర్వక సమాచారం ఇవ్వడమో చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని శనివారం సాయంత్రం నుంచి కల్పించినా ఆది, సోమవారాలు పాఠశాలలకు సెలవులు కావటం.. మరోవైపు హెచ్‌ఎంలకు పరిషత్ ఎన్నికల శిక్షణ తరగతులు ఉండటంతో చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
పేర్ల నమోదుకు మరో మూడు, నాలుగు రోజులు గడువు పొడిగించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా విద్యా సంవత్సరం బాగా ఆలస్యంగా ప్రారంభమైంది. నాలుగైదు మాసాలకు మించి జరగదని ఈ స్వల్ప వ్యవధికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పూర్తి ఫీజు కట్టించుకుంటాయని భావించి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సర్కారీ పాఠశాలల్లో చేర్పించారు. అయితే ప్రభుత్వ పరీక్షల విభాగం ఛైల్డు ఇన్‌ఫో డేటాలో జనవరి 20 నాటికి పాఠశాలల వారీగా పదవ తరగతిలో ఉన్న విద్యార్థుల ప్రవేశాలను ఆధారంగా చేసుకుని నామినల్ రోల్స్ జాబితా తయారుచేసి పాఠశాలలకు పంపింది. ఆ తర్వాత కూడా చాలా మంది చేరారు. దీంతో భౌతికంగా ఉన్న పిల్లల వివరాలకు, రోల్స్‌కు పొంతన లేకుండా పోయింది.
జిల్లా వ్యాప్తంగా ఇలాంటి విద్యార్థులు వెయ్యి మందికి పైగా ఉంటారని ప్రాథమిక అంచనా. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పది పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి పేరు ఎన్‌ఆర్ జాబితాలో ఉండాలి. అలా లేని విద్యార్థి కనీసం పరీక్ష ఫీజు చెల్లించటానికి కూడా అవకాశం లేకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో ఎవరికి వారు ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెంది సోమవారం సెలవు అయినా డీఈఓ కార్యాలయానికి వచ్చి రాతపూర్వకంగా లేఖ రాసి తమ విద్యార్థుల పేర్లు నమోదు చేయాలని కోరటం కనిపించింది. కొందరు పదవ తరగతి చదువుతుంటే పొరపాటున వారి పేర్లు 9వ తరగతిలో ఉన్నట్లు ఛైల్డు ఇన్‌ఫోలో గుర్తించి ఆ జాబితాలు తీసుకుని కొందరు ప్రైవేటు పాఠశాలల హెచ్‌ఎంలు డీఈఓ కార్యాలయానికి వచ్చారు. మంగళవారం నాటికి తమకు చేరిన ప్రతి అభ్యర్థననూ పరిశీలిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.