Gujarat: లవర్స్‌కు సర్కార్ బిగ్ షాక్..! రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే పేరెంట్స్ పర్మిషన్ మస్ట్..! ఇంకా..
పలు సామాజిక వర్గాల నుంచి వస్తున్న విన్నపాల కారణంగా గుజరాత్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలతో కొత్త నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
Representative Image (Image Credit To Original Source)
- ప్రేమ వివాహాలకు పెద్దల అనుమతి తప్పనిసరి
- తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ ఇవ్వాలి
- దరఖాస్తులో తల్లిదండ్రుల పేర్లు, చిరునామాలు, ఆధార్, సంప్రదింపు వివరాలు ఇవ్వాలి
Gujarat: ప్రేమికులకు గుజరాత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. రిజిస్టర్ మ్యారేజ్ విషయంలో కొత్త రూల్ తీసుకొస్తోంది. రిజిస్టర్ పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అంటోంది. ప్రేమ వివాహాలపై పెద్దలకు సమాచారం ఇవ్వడాన్ని గుజరాత్ ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పెళ్లికి దరఖాస్తు చేసే వారు తమ పెద్దలకు సమాచారం ఇచ్చామని డిక్లరేషన్ ఇవ్వాలి. పైగా అమ్మాయి పేరెంట్స్‌కు అధికారులే అప్లికేషన్ షేర్ చేస్తారు.
పేరెంట్స్ పర్మిషన్, డిక్లరేషన్ తో పాటు 30 రోజులు వేచి ఉండే గడువును రిజిస్ట్రేషన్ ఆఫీసులు అమలు చేయనున్నాయి. తమ ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి తప్పకుండా ఇంట్లో వాళ్లకి తెలుసుండాలి. వాట్సాప్, ఎస్ఎంఎస్ ల ద్వారా ఇదే విషయాన్ని పెళ్లిళ్లు చేసే రిజిస్టర్ అధికారి వధూవరుల తల్లిదండ్రులకు చేరవేస్తారు. వారి నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు. దీనికి 10 రోజుల సమయం కూడా తీసుకుంటారు. దీని వల్ల ఏదైనా గొడవలు, సమస్యలున్నా పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. అలాగే తప్పుడు సమాచారంతో చేసుకునే వివాహాలను అడ్డుకునేందుకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంతో గుజరాత్ రాష్ట్రంలోని ప్రేమ జంటలు పరేషాన్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటేనే కంగారు పడుతున్నాయి.
కాపురాలు నిలబడక విడాకులు..
ప్రేమ పేరుతో యువతీ యువకులు దగ్గర అవుతున్నారు. ఇంట్లో చెప్పకుండానే పెళ్లి చేసేసుకుంటున్నారు. కట్ చేస్తే.. కొన్నాళ్లకే విడిపోతున్నారు. కాపురాలు నిలబడక విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు బాగా పెరిగిపోయాయి. దీనికి తోడు మతాంతర వివాహాలు, లవ్ జిహాద్ ట్రాప్‌లు పెరిగాయి. దీంతో గుజరాత్లో రిజిస్టర్ పెళ్లిళ్లకు కొత్త నిబంధనలను తెచ్చే పనిలో ఉంది అక్కడి సర్కార్. తప్పనిసరిగా పేరెంట్స్‌కు పెళ్లి గురించి తెలిసుండి.. అనుమతి ఉంటే తప్ప రిజిస్టర్ మ్యారేజ్ చేయబోమని చెబుతోంది.
పలు సామాజిక వర్గాల నుంచి వస్తున్న విన్నపాల కారణంగా గుజరాత్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలతో కొత్త నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీని వల్ల మానవ సంబధాలు, బంధుత్వాలు ధృడపడతాయని, మోసపూరిత వివాహాలు తగ్గుతాయని నమ్ముతోంది. పెళ్లి కోసం దరఖాస్తు చేసుకోవడానికి, పెళ్లి తర్వాత సర్టిఫికెట్ పొందడానికి 30 రోజుల టైమ్ పీరియడ్‌ను తప్పనిసరి చేయనున్నారు. ఆధార్ కార్డు, వయసును ధృవీకరించే బర్త్ సర్టిఫికెట్, ఫోన్ నెంబర్లు, ఆహ్వాన పత్రిక.. ఇలాంటి డాక్యుమెంట్స్ తప్పనిసరి.
వెడ్డింగ్ ఇన్విటేషన్, శుభాకాంక్షలు తెలిపిన వారి వివరాలను కూడా ప్రభుత్వం తమ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తుంది. దీని వల్ల అధికారిక పెళ్లి ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందనేది గుజరాత్ సర్కార్ అభిప్రాయం. దీనికి పలు సామాజిక వర్గాల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. అందుకే ఈ నిబంధనలను చట్టబద్ధం చేయాలనుకుంటోంది ప్రభుత్వం. కానీ.. చెప్పా పెట్టకుండా ఇంట్లో వారికి తెలీకుండా వచ్చి పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే ప్రేమ జంటలకు మాత్రం ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.
వివాహాల రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు..
గుజరాత్ తన వివాహ నమోదు వ్యవస్థను పునర్ నిర్మించడానికి, తల్లిదండ్రుల ప్రమేయాన్ని ఈ ప్రక్రియలో కేంద్రంగా మార్చడానికి సన్నాహాలు చేస్తోందని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు. ముఖ్యంగా ప్రేమ వివాహాలు, పారిపోయి పెళ్లి చేసుకోవడాలు వంటి దుర్వినియోగాల మధ్య మహిళలను రక్షించడానికి, మోసాలను నిరోధించడానికి, పారదర్శకతను పునరుద్ధరించడానికి గుజరాత్ వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం, 2006ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. నిజమైన ప్రేమ వివాహాలకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని, అయితే మోసం, దోపిడీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వి వెల్లడించారు.
“ప్రేమించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సలీం సురేష్‌గా నటిస్తూ ఒక అమ్మాయిని వలలో వేసుకుంటే, మేము వారిని వదిలిపెట్టము” అని మంత్రి హెచ్చరించారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, ప్రతి వివాహ రిజిస్ట్రేషన్ దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్ ముందు సమర్పించాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుదారులు వధూవరులు తమ తల్లిదండ్రులకు వివాహం గురించి తెలియజేశారా లేదా అనే విషయాన్ని తెలిపే డిక్లరేషన్‌ను జత చేయాల్సి ఉంటుందన్నారు.
అంతేకాకుండా, వధూవరులు దరఖాస్తులో వారి తల్లిదండ్రుల పేర్లు, చిరునామాలు, ఆధార్, సంప్రదింపు వివరాలను అందించాలి. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంతృప్తి చెందిన వెంటనే వధూవరుల తల్లిదండ్రులకు 10 పని దినాలలోపు సమాచారం అందించబడుతుంది.
* తల్లిదండ్రులకు తమ పెళ్లి గురించి సమాచారం ఇచ్చామని తెలుపుతూ డిక్లరేషన్ ఇవ్వాలి.
* ప్రేమ జంట వారి పేర్లు, అడ్రస్ లు, ఆధార్, తల్లిదండ్రుల కాంటాక్ట్ డిటైల్స్ ఇవ్వాలి.
* సాక్షులు సైతం వారి ఫోటోలు, ఆధార్ వివరాలు ఇవ్వాలి.
* ప్రేమ జంట ఇచ్చిన వివరాలతో సంతృప్తి చెందినట్లు అయితే అసిస్టెంట్ రిజిస్ట్రర్ 10 రోజుల్లో అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు.
