భూమిపై 2050 తర్వాత ఫుడ్ దొరకదట

వాతావరణ పరిస్థితుల కారణంగా భూమిపై 2050 తర్వాత ఫుడ్ దొరకదని ఓ సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారానికి 50శాతం డిమాండ్ పెరిగిపోతుంది. కానీ, వాతావరణ పరిస్థితుల కారణంగా 30శాతం పంట దిగుబడులు మందగిస్తాయని ఫలితంగా 2050 నాటికి ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్వే వెల్లడించింది. 

యూఎన్ సెక్రటరీ జనరల్ బన్ కీ మూన్ నేతృత్వంలో ద గ్లోబల్ కమిషన్ ఆన్ అడాప్షన్(జీసీఏ) ఈ సర్వే నిర్వహించింది. ఆహారం అందక తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. ఈ ఆహార కొరత ఏర్పడే 19దేశాల్లో భారత్ కూడా ఉందని సెక్రటరీ సీకే మిశ్రా తెలిపారు. 

ఇది ఊహాజనిత సర్వే కాదని మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు వేసిన అంచనా అని ఆయన తెలియజేశారు. పూర్తిగా ఎడారిగా మారుతుందని అనుకోవడం లేదు కానీ, సరిపడా మొక్కలనేవి కనపడకుండాపోవడం మాత్రం నిజమని వెల్లడించారు. 10బిలియన్ మంది ప్రజల కోసం మరో 50శాతం అధికంగా పండించాల్సిన పరిస్థితి వస్తుందని దాంతో పాటు పంటలకు వెచ్చించే ఖర్చులు కూడా పెరిగిపోతాయని ఆయన పేర్కొన్నారు. 

తీర ప్రాంతాల్లో ఉన్నవారు నీటి వనరులకు దగ్గరగా ఉండే వారి పరిస్థితి పరవాలేదు. కానీ, కాంక్రీట్ జంగిల్‌లో మగ్గిపోయే వారికి ఆహారం అందాలంటే చాలా తిప్పలు పడాల్సిన పరిస్థితి ముందుందని హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులు అనేవి ఇలాగే ప్రతికూలంగా సాగుతుంటే తప్పదని, మేల్కొని జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.