ముంబైలోని గోరెగావ్‌లో దారుణం జరిగింది. గురువారం రాజు వాగ్మేర్ అనే వ్యక్తిని తన ఇద్దరు భార్యలు హతమార్చారు. రాజు 2006లో సవితను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. 2010లో సరితను ఒకే ఒక్క సంతానం. తన ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చొని మద్యం తాగుతూ గడిపేసేవాడు.
భార్యలిద్దరినీ, పిల్లలను వేధింపులకు, హింసకు గురిచేస్తుండటంతో విసిగిపోయారు. ఎలాగైనా రాజును హతమార్చాలని పథకం వేశారు. సరిత, సవిత గురువారం అర్ధరాత్రి అనువైన సమయంగా ఎంచుకున్నారు. ఒంటిగంటకు మద్యం మత్తులో ఉన్న రాజును మంచం మీద పడుకోబెట్టారు. కదలకుండా కాళ్లూచేతులూ తాళ్లతో కట్టేశారు. దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా బిగించారు.
కొద్ది సేపటిలోనే అతను మృతి చెందాడు. తమకేమీ తెలియడం లేదని రాజు స్పందించడం లేదని మృతుడి అన్న వినోద్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో వైద్యులు చనిపోయాడని ధ్రువీకరించారు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక విచారణలోనే ఇద్దరు భార్యలు కలిసి హతమార్చారని తెలిసింది. వారిని అరెస్టు చేయడంతో పాటు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.