CM Vijay – NEET: నీట్ రద్దు చేయండి, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయండి- సీఎం విజయ్ సంచలన డిమాండ్

నీట్‌ పరీక్ష సంపన్న, పట్టణ, ఆంగ్ల విద్య అభ్యసించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని మొదటి నుంచీ వాదిస్తోంది.

  • Updated on- May 13, 2026 / 11:03 PM IST

CM Vijay – NEET: వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో జరిగిన భారీ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఆయన కేంద్రం ముందు సంచలన ప్రతిపాదన ఉంచారు. వైద్య కోర్సులకు నీట్ ఆధారిత ప్రవేశాలను రద్దు చేసి దాని స్థానంలో 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ కేంద్రాన్ని కోరారు.

అఖిల భారత పరీక్షపై విమర్శలు గుప్పించారు విజయ్. దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విషయంలో రాజీపడటం, నీట్ దుర్వినియోగం కావడం ఇది మొదటిసారి కాదన్నారు విజయ్. నీట్ యూజీ రద్దు చేసి.. దాని స్థానంలో 12వ తరగతి మార్కుల ఆధారిత వైద్య ప్రవేశాల కోసం పర్మిషన్ ఇవ్వాలని విజయ్ ఒత్తిడి చేశారు. కాగా, నీట్ పరీక్ష రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది వైద్య విద్యార్థుల ఆశలను దెబ్బతీసిందని విజయ్ వాపోయారు.

కాగా, రాజకీయాలకు అతీతంగా తమిళనాడు రాష్ట్రం మొదటి నుంచి కూడా నీట్‌కు వ్యతిరేకంగా ఉంది. ఈ పరీక్ష సంపన్న, పట్టణ, ఆంగ్ల విద్య అభ్యసించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని వాదిస్తోంది. ఈ విధానం మాతృభాషా మాధ్యమంలో చదువుకున్న, గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులను మినహాయిస్తుందని వాదించింది. ఈ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ మరోసారి రాష్ట్రం వాదనలు వినిపించింది.

”2024లో ప్రశ్నపత్రం లీక్ అవ్వడంతో ఆరు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి సీబీఐకి బదిలీ చేశారు. ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సంస్కరణల కోసం 95 సమగ్ర సిఫార్సులను సమర్పించింది. ఇవన్నీ జరిగినప్పటికీ, రెండేళ్లలోపే మరో పేపర్ లీక్ అవ్వడంతో పరీక్షను రద్దు చేశారు”. ఇది “జాతీయ స్థాయి పరీక్షలో ఉన్న లోపాలకు, నిర్మాణాత్మక లోపాలకు నిలువెత్తు రుజువు” అని విజయ్ అన్నారు.

మొదటి నుంచి నీట్ ను వ్యతిరేకిస్తున్న తమిళనాడు..

“నీట్ ప్రారంభమైనప్పటి నుండి దానిని తమిళనాడు ప్రభుత్వం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. నీట్ ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ నేపథ్యాలు, సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. నీట్‌ను రద్దు చేసి, ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్ కోర్సులలోని అన్ని సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా రాష్ట్ర కోటా కింద భర్తీ చేయడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలన్న రాష్ట్ర దీర్ఘకాల డిమాండ్‌ను తమిళనాడు ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది” అని విజయ్ అన్నారు.

గత సంవత్సరం నవంబర్‌లో, 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య కోర్సులలో ప్రవేశాలను పునరుద్ధరించడానికి రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టమైన నీట్ మినహాయింపు బిల్లుకు భారత రాష్ట్రపతి ఆమోదం నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

యూపీఏ హయాంలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వైద్య ప్రవేశాల కోసం తమిళనాడుకు ప్రవేశ పరీక్షల నుండి మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల, కేవలం ఒక పరీక్ష ఫలితాన్ని చూడకుండా, నిలకడగా రాణించిన వారికి ప్రతిఫలం ఇచ్చే విధంగా ఆ రాష్ట్రం తన 12వ తరగతి ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టగలిగింది. కానీ 2017లో కేంద్ర ప్రభుత్వం నీట్ (NEET)ను తప్పనిసరి చేసిన తర్వాత ఆ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రాజకీయాలకు అతీతంగా తమిళనాడు మొదటి నుంచి కూడా నీట్‌కు వ్యతిరేకంగా ఉంది. ఈ పరీక్ష సంపన్న, పట్టణ, ఆంగ్ల విద్య అభ్యసించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని వాదిస్తోంది.

Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ కి రెడీ అయిపోయారా? ఎప్పటి నుంచి..? కేంద్రం చెప్పిందిదే..