Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ కి రెడీ అయిపోయారా? ఎప్పటి నుంచి..? కేంద్రం చెప్పిందిదే..
ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ పొదుపు చర్యల గురించి ప్రస్తావించారు. పెరుగుతున్న ప్రపంచ చమురు ధరల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Work From Home: ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఆయన మరీ మరీ కోరారు. ఇంధనాన్ని పొదుపు చేసే చర్యల్లో భాగంగా ఆయన పలు సూచనలు చేశారు. అందులో ముఖ్యమైనది ఐటీ సెక్టార్ కు వర్క్ ఫ్రమ్ హోమ్. దీంతో త్వరలోనే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తాయని అంతా అనుకుంటున్నారు. అంతే కాదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఐటీ ఉద్యోగులు సైతం రెడీపోయారు. అయితే, ఐటీ రంగానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాట్లను తప్పనిసరి చేసే ప్రతిపాదన ప్రస్తుతం ఏదీ పరిశీలనలో లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
”ఈ దశలో ఎలాంటి అధికారిక ఆదేశం జారీ చేసే ఆలోచన లేదు. మహమ్మారి వచ్చినప్పటి నుండి ఐటీ పరిశ్రమలో చాలావరకు ఇప్పటికే హైబ్రిడ్ పని విధానాలను అవలంబించింది. తప్పనిసరి రిమోట్ వర్కింగ్‌కు సంబంధించిన ఏ విధాన నిర్ణయమైనా కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం అలాంటి ప్రక్రియ ఏదీ జరగడం లేదు” అని అధికార వర్గాలు తెలిపాయి.
పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరల నేపథ్యంలో కేంద్రం పొదుపు, మితమైన వినియోగం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రణాళికలు లేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తయారీ, ఎగుమతులు, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణతో సహా ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయని అధికారులు తెలిపారు.
పెరుగుతున్న ప్రపంచ మెమరీ చిప్ ధరలు సమీప భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువను పెంచవచ్చని, అదే సమయంలో భారతదేశంలో కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణం, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ (AI) సర్వర్లు అత్యవసరంగా అవసరమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 116.17 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
కాగా సాధ్యమైన చోటల్లా ఉద్యోగులను రిమోట్‌గా పని చేయడానికి అనుమతించాలని ఈ మేరకు ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలకు సలహా ఇవ్వాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను నూతన సమాచార సాంకేతిక ఉద్యోగుల సెనేట్ (నైట్స్) కోరింది. ఇంధనాన్ని ఆదా చేయాలని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధాని ఇచ్చిన పిలుపునకు ఈ చర్య అనుగుణంగా ఉంటుందని ఆ సంఘం పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు పొదుపు..
ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ పొదుపు చర్యల గురించి ప్రస్తావించారు. దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, దిగుమతి చేసుకున్న పెట్రోలియం ఉత్పత్తులను తెలివిగా ఉపయోగించాలని పౌరులను కోరారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా వర్క్-ఫ్రమ్-హోమ్ ఏర్పాట్లు, వర్చువల్ సమావేశాలు, ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లతో సహా కోవిడ్ రోజుల నాటి అనేక పద్ధతులను పునరుద్ధరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్), కార్-పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, రైలు సరుకు రవాణ వినియోగాన్ని ప్రోత్సహించారు.
Also Read: డీజిల్ ఖతం.. హైవేపై ఆగిపోయిన లారీలు.. 70-80 కిలోమీటర్లు..
