హనీట్రాప్ : అందమైన అమ్మాయిల వలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు

హనీట్రాప్.. మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అందమైన అమ్మాయిల వలలో రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు

  • Publish Date - September 21, 2019 / 05:59 AM IST

హనీట్రాప్.. మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అందమైన అమ్మాయిల వలలో రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు

హనీట్రాప్.. మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అందమైన అమ్మాయిల వలలో రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు చిక్కుకున్నారు. భారీ మొత్తంలో డబ్బు  ఇచ్చుకున్నారు. ట్రాప్ నుంచి బయటకు రాలేక నరకం చూశారు. ఐదుగురు మహిళలు వారిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. చివరికి గ్యాంగ్ ని పోలీసులు అరెస్టు చేయడంతో  హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన ఐదుగురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, బిల్డర్లను టార్గెట్ చేసుకున్నారు. హనీట్రాప్ చేశారు.  వారిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ముఠా బాగోతాన్ని ఇండోర్ పోలీసులు బట్టబయలు చేశారు. ముఠా గురించి పోలీసులకు రహస్య సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హనీట్రాప్  చేసి డబ్బులు గుంజుతున్న మహిళలు, యువకుడిని అరెస్టు చేశారు. ప్రముఖ వ్యక్తులను ముఠా బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హనీట్రాప్ వ్యవహారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం  రేపుతోంది. రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ కేసుని దర్యాప్తు చేస్తోంది.

హనీట్రాప్ ముఠా చేతిలో చిక్కుకున్న రాజకీయ నేతల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీకి చెందిన నేతలు ఉన్నారు. హనీట్రాప్ వలలో చిక్కుకున్న మున్సిపల్ అధికారి ఒకరు పోలీసులను ఆశ్రయించాడు. తాను  మోసపోయానని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, డబ్బు డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్టు.. ముఠా గుట్టు  బయటపడింది. 

కాగా పోలీసులు పట్టుకున్న ముఠాలో ఓ మహిళ కాంగ్రెస్ మీడియా సెల్ లో ఉద్యోగిగా పని చేసినట్టే దర్యాఫ్తులో తేలింది. ముఠా సభ్యులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి మూడు రోజుల రిమాండ్  విధించింది. యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ కేసుని విచారిస్తోందని గోవింద్ పుర ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు. మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని వెల్లడించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో  అభ్యంతరకర సమాచారం ఉందని చెప్పారు. 

ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని, చట్టం తన పని తాను చేసుకుపోవాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ చెప్పారు. దీనిపై హోంమంత్రి బాలా బచ్చన్ స్పందించారు. ఇండోర్ పోలీసులకు అందిన  ఫిర్యాదుతో హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. హనీట్రాప్ గ్యాంగ్ చేతిలో బ్లాక్ మెయిల్ కు గురైన వారి పేర్లు వెల్లడించేందుకు హోంమంత్రి నిరాకరించారు. దర్యాఫ్తు జరుగుతోందని ఈ పరిస్థితుల్లో ఏమీ  చెప్పలేము అన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, నిష్పక్షపాతంగా కేసుని విచారిస్తామని.. దోషులు ఎవరైనా, ఎంటటి వారైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

కాగా, 2013 నుంచి హనీట్రాప్ ముఠా యాక్టివ్ గా ఉందని, అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకున్నారని పోలీసులు చెప్పారు. బాధితుల్లో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు,  బిల్డర్లు ఉన్నారు. హనీ ట్రాప్ అంటే అందమైన అమ్మాయిలను ఎరగా వేయడం. సోషల్ మీడియా వేదికగా యువకులు, రాజకీయ నేతలు, ప్రముఖులను ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్  చేస్తారు. కొందరు డబ్బు దోచుకుంటారు, మరికొందరు ఉగ్రవాదులకు కావాల్సిన సహాయ సహకారాలు పొందుతారు. వీలైతే సైనిక రహస్యాలను తెలుసుకుంటారు.