ఏనుగును ఢీ కొట్టిన రైలు: కంటతడి పెట్టిన ప్రయాణికులు

  • Publish Date - September 30, 2019 / 05:40 AM IST

వెస్ట్ బెంగాల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై ఉన్న ఏనుగుని రైలు ఢీ కొట్టడంతో ఏనుగుకు తీవ్ర గాయాలయ్యయి. దీంతో ఏనుగు కదలలేక, నిల్చోలేక ముందు రెండు కాళ్లతో పాకుతూ పట్టాలను దాటింది. దీంతో అక్కడి వారంతా ఏనుగును చూసి కంటతడి పెట్టారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాలు.. వెస్ట్ బెంగాల్ ఉత్తర ప్రాంతంలో దట్టమైన అడువులు ఉన్నాయి. అందువల్ల ఆయా ప్రాంతాల్లో ఏనుగులు సంఖ్య ఎక్కువ. ఈ అడవుల మధ్య నుంచే రైలు మార్గం ఉండటంతో శుక్రవారం (సెప్టెంబర్ 27, 2019)న బనర్హట్ నుంచి నాగ్రకాటా స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న ఓ ఏనుగును సిలిగురి ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. ఏనుగు పట్టాలపైకి వచ్చిన వెంటనే పైలెట్ బ్రేకులు వేశారు. కానీ రైలు ఆగలేదు. వేగంగా వెళ్లి ఏనుగును ఢీ కొట్టిన తర్వాత ఆగింది. దీంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది. 

 ఇక అక్కడే ఉన్న రైలు ప్రయాణికులు గాయపడ్డ ఏనుగును వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే నార్తర్న్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ అధికారులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఏనుగులను ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు.