అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఈ మధ్యకాలంలో పదే పదే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ట్రంప్. అయితే కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్ లో మోడీతో సమావేశనప్పుడు జమ్మూకశ్మీర్ భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని,ఇందులో తమ జోక్యం ఉండదు అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు మళ్లీ తన నోటికి పని చెప్పారు. కశ్మీర్ విషయంలో మద్యవర్తిత్వం వహించేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు.
వైట్ హౌస్ లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ…జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దు తర్వాత భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వారాల క్రితంతో పోలిస్తే రెండు దేశాల మధ్య పరిస్థితులు కొంతమేర చక్కబడ్డాయనుకుంటున్నాను. భారత్-పాక్ లు కోరుకుంటే మధ్యవర్తిత్వం వహించి వారికి సహాయం చేయడానికి ఇష్టపడతాను అని ట్రంప్ అన్నారు. ఇరు దేశాలతో సంప్రదింపులు జరిపానని, ఈ ఆఫర్ ఉన్న విషయం రెండు దేశాలకు తెలుసునని ట్రంప్ అన్నారు.
ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ట్రంప్.. కశ్మీర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఇమ్రాన్ సమక్షంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. గత వారం మోడీతో సమావేశమైనప్పుడు కూడా కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశం అన్నారు. కశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. చర్చల ద్వారా భారత్-పాక్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని ట్రంప్ సూచించారు. మళ్లీ ఇప్పుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.