దిగొచ్చిన ట్విట్టర్..కేంద్రం సూచించిన అకౌంట్లు తొలగింపు

Twitter ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న అకౌంట్లను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను ఎట్టకేలకు ట్విట్టర్ పాటించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం సూచించిన వాటిలో 97 శాతం అకౌంట్లు, పోస్టులను బ్లాక్‌ చేసినట్లు సమాచారం.

రైతుల ఉద్యమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం, ట్విట్టర్‌కు మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ట్వీట్లు చేసిన 1,178 ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కొద్ది రోజులు క్రితం ట్విట్టర్ కు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛకు తాము ప్రాధాన్యం ఇస్తామంటూ ప్రభుత్వం సూచించిన వాటిలో కొన్నింటిపైనే ట్విట్టర్ సంస్థ చర్య తీసుకుంది. ఆ వ్యవహారంలో కేంద్రం తీవ్ర ఆగ్రహానికి గురైంది.

ఈ క్రమంలో ట్విట్టర్ అభ్యర్థన మేరకు బుధవారం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్విట్టర్ ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి.. ట్విట్టర్​ ప్రతినిధుల వద్ద పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారికి అవకాశం కల్పించడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు ట్విట్టర్​కు ఐటీ కార్యదర్శి తెలిపారు. భారత్​ లో ఎర్రకోటపై వద్ద జరిగిన ఘటనను అమెరికాలో క్యాపిటల్​ భవనంపై జరిగిన దాడితో పోల్చారు. ఈ రెండు అంశాల్లో ట్విట్టర్ చర్యల్లో వ్యత్యాసం ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్​లో ట్విట్టర్​ కార్యకలాపాలకు రాజ్యంగం, స్థానిక చట్టాలే మహోన్నతమైనవని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన సంస్థలు స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలనే విషయాన్ని స్పష్టం చేశారు. స్థానిక చట్టాలను పాటించాలని లేకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సంస్థ ప్రతినిధులకు తేల్చి చెప్పారు. దీంతో తాజాగా ట్విట్టర్.. కేంద్రం ఆదేశాలను పాటించిందని, 97 శాతం ఖాతాలను, పోస్టులను బ్లాక్‌ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ స్పందించలేదు.

మరోవైపు,సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల ద్వారా జరుగుతోన్న తప్పుడు ప్రచారం, విద్వేష వ్యాప్తి కట్టడికి ఓ యంత్రాంగం ఏర్పాటు చేయాలంటూ బీజేపీ నేత వినీత్​ గోయెంకా దాఖలు చేసిన పిటిషన్​పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..కేంద్రం, ట్విట్టర్​కు నోటీసులు జారీ చేసింది. తమ అభిప్రాయాలు తెలపాలని ఆదేశించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రముఖుల ఫొటోలతో ట్విట్టర్​, ఫేస్​బుక్​ సహా సామాజిక మాధ్యమాల్లో కొందరు నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారని పిటిషన్​లో వివరించారు గోయెంకా. ఇలాంటి ఖాతాలు వందల సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. వాటి ద్వారా జరిగే తప్పుడు ప్రచారం దేశంలో అల్లర్లకు మూల కారణం అవుతోందని వివరించారు. అలాంటి వాటి కట్టడికి కేంద్రం ఓ యంత్రాంగం ఏర్పాటు చేసేలా చూడాలని అభ్యర్థించారు. ఈ అంశంపై ఇప్పటికే దాఖలైన ఇదే తరహా పిటిషన్లతో గోయెంకా అభ్యర్థనను జత చేస్తున్నామని, కేంద్రం, ట్విట్టర్​కు నోటీసులు జారీ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు