Nepal Helicopter Collide : నేపాల్‌లో ల్యాండింగ్ సమయంలో ఢీకున్న రెండు హెలికాప్టర్లు.. భారతీయుడు మృతి.. వీడియో
Nepal Helicopter Collide : నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లా ఫెరిచే హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ సమయంలో రెండు హెలికాప్టర్లు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు.
- Harish Thanniru
- Published on- November 3, 2026 / 01:02 PM IST
Nepal Helicopter Collide
Nepal Helicopter Collide : నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతానికి సమీపంలో ల్యాండ్ అవుతున్న రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భారతీయ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ప్రయాణికుడితో పాటు ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.
Also Read : Mukesh Ambani Net Worth : ఒక్క దెబ్బతో సీన్ రివర్స్.. ఆసియా సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ టాప్!
మంగళవారం ఉదయం నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్లు ల్యాండింగ్ సమయంలో రోటర్ బ్లేడ్లు ఒకదానికొకటి తగలడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లా ఫెరిచే హెలిప్యాడ్ వద్ద మంగళవారం ఉదయం సుమారు 8.11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫిష్‌టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో వాటి రోటర్ బ్లేడ్లు ఢీకొన్నాయి. దీంతో రెండు హెలికాప్టర్లు ప్రమాదానికి గురయ్యాయి.
ఈ ప్రమాదంలో 47 ఏళ్ల భారతీయుడు వసంత్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అతను తమిళనాడులోని చెన్నైకి చెందిన వ్యక్తి. ఆయన ఫిష్‌టెయిల్ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు నేపాల్ పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని లుక్లాలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి షైలేష్ కిషన్ పటేల్ గాయపడ్డారు. ఆయనను మరో హెలికాప్టర్ ద్వారా ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన పైలట్లు రవీంద్ర ప్రజాపతి, ప్రజ్వల్ కే.సీలను కూడా మెరుగైన వైద్యం కోసం ఖాట్మండుకు తీసుకెళ్లారు.
ఫెరిచే ప్రాంతం మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఖాట్మండుకు ఈ ప్రాంతం సుమారు 150 కిలోమీటర్ల ఈశాన్య దిశలో ఉంది. పర్వతారోహకులు, పర్యాటకులను తరలించడంతో పాటు అత్యవసర సహాయక చర్యల కోసం ఈ ప్రాంతంలో హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తుంటారు. అయితే, రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్ సమయంలో ఎలా ఢీకొన్నాయనే అంశంపై నేపాల్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే, హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
