Model Tenancy Act
Model Tenancy Act బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్…నమూనా అద్దె చట్టానికి(Model Tenancy Act)ఆమోదం తెలిపింది. దేశంలోని అన్ని ఆదాయ వర్గాల వారికి తగిన రీతిలో అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడం, అద్దె ఇళ్ల మార్కెట్‌ను స్థిరీకరించడం లక్ష్యంగా కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా దేశంలో అద్దె గృహాల్లో ఉండే వారికి చట్టపరమైన హక్కును కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది.
ప్రస్తుతం సంస్థాగతంగా ఉంటున్న అద్దె ఇళ్లు.. ఈ చట్టంతో వ్యవస్థాగతంగా మారే అవకాశం ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇచ్చే వెసులుబాటుతో పాటు ప్రైవేటు రంగానికి వ్యాపారావకాశాలను కల్పించేదిగా ఇది ఉపయోగపడనుంది. అద్దె ఇళ్ల రంగంలోకి ప్రైవేటు సంస్థలూ ప్రవేశించి, దేశంలో ఇళ్ల కొరత తీరేందుకు ఇది ఉపకరిస్తుందని కేంద్రం పేర్కొంది. కొత్త చట్టం చేయడం లేదా ఉన్నవాటిని సవరించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ నమూనా చట్టంలోని నిబంధనలను అమలు చేయాలని కేంద్రం సూచించింది. ఇంటి అద్దె చట్టం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వర్తిస్తుంది.
2019 లో కేంద్రం “మోడల్ అద్దె చట్టం” ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇంటి అద్దె చట్టం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వర్తిస్తుంది. ఇది ఇళ్లకు మాత్రమే కాక.. వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. ఈ చట్టం కింద ఇంటికి రెండు నెలల అద్దె, వ్యాపార విభాగాలకు అయితే ఆరు నెలల అద్దె ముందస్తుగా యజమానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆపై మాత్రమే ఇరువురు చట్టబద్ధమైన ఒప్పందం చేసుకోవాలి. ఇందుకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఉంటుంది. కేవలం 60 రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే, అద్దెను సవరించడానికి మూడు నెలల ముందు భూ యజమాని రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి.అదేవిధంగా, అద్దెదారుతో వివాదం జరిగితే యజమాని విద్యుత్, నీటి సరఫరాను కట్ చేయలేడు. దీంతోపాటు మరమ్మతులు చేయటానికి లేదా ఇతర అవసరాలకు 24 గంటల ముందస్తు నోటీసు లేకుండా యజమాని అద్దె ప్రాంగణంలోకి ప్రవేశించలేడని కూడా ఈ చట్టంలో పొందుపర్చారు.