PM SHRI Schools : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు ఆమోదం తెలిపింది. పీఎం గతి శక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు దీర్ఘకాలికంగా లీజుకివ్వాలని నిర్ణయించింది. రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా 6శాతం నుంచి 1.5శాతానికి తగ్గించింది. ఐదేళ్లున్న లీజు పీరియడ్ ను 35ఏళ్లకు పెంచింది.
ఐదేళ్లలో 300 కార్గో టర్మినళ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ ద్వారా 1.2లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్ కు మరింత ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది. ఆసుపత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు పీపీపీ పద్ధతిలో రైల్వే భూములను ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
పీఎం శ్రీ స్కూల్స్ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా 18లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూల్స్ ను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
రాబోయే ఐదేళ్లలో 27వేల 360 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో కేంద్ర వాటా రూ.18వేల 128కోట్లు ఉండనుంది. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తూ పీఎం శ్రీ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.