Sukanya Samriddhi Yojana : ఆడపిల్ల పుడితే చాలు ఇక పొదుపు చేయాలి అంటారు పెద్దలు. ఆ పొదుపు చేసిన డబ్బు బంగారం కొనటానికి పెళ్లికి ఉపయోగపడుతుందని.కానీ ఇప్పుడలాకాదు. ఆడపిల్ల పెళ్లికి మేమే డబ్బు ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఓ చక్కటి పథకం తీసుకొచ్చింది.అదే సుకన్య సమృద్ధి యోజన (ఎస్.ఎస్.వై) పథకం. సమాజంలో ఆడ పిల్లలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం తీసుకొచ్చిన ఈ చిన్న మొత్తాల పొదుపు పథకం..ఈ పథకం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.
దీనిని భారత ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా 2015 లో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. ఆడపిల్లల భవిష్యత్తుకి ఆర్థిక భరోసా కల్పించేందుకు, ఉన్నత విద్య, వివాహ సమయాల్లో తోడ్పాటునిచ్చేలా ఉపయోగపడుతుంది.
ఈ పథకం కొత్తగా కేంద్రం ప్రవేశపెట్టిన పెళ్లి వయస్సు ప్రకారం యువతికి 21 సంవత్సరాలు నిండినపుడు ఈ పథకం మెచ్యూరిటీకి వస్తుంది. అలా వచ్చిన మొత్తం చదువు, పెళ్లి అవసరాలకు సహాయపడే విధంగా రూపొందించిన పొదుపు పథకమే Sukanya Samriddhi Yojana.
ఈ పథకాన్ని ప్రారంభించి మెచ్యూరిటీ అయ్యే దాకా నిర్ణీత సొమ్ము కడితే ఖాతా ముగిసే సమయానికి సమయానికి రూ.71 లక్షల వరకు వస్తుంది. ఇంత పెద్ద మొత్తం వస్తుంది కాబట్టి..దానికి గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కట్ అవుతుందనే బాధే ఉండది. ఈ పథకానికి అటువంటి ఇబ్బంది ఏమీ లేదు.ఈ డిపాజిట్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది ప్రభుత్వం.
ఎవరు అర్హులు?
ఆడ పిల్ల పుట్టిన తరువాత నుంచి ఆమెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే లోపు ఎప్పుడైనా Sukanya Samriddhi Yojana ఖాతాను తెరవచ్చు. అయితే ఆమె ఖచ్చితంగా భారతీయ పౌరురాలై ఉండాలి. అలాంటప్పుడే ఈ ఖాతా ప్రయోజనాలను పొందగలరు.
తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతినిస్తారు. ఇందుకోసం వైద్యపరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
దత్తత తీసుకున్న బాలిక పేరు పై కూడా ఈ ఖాతా తెరవ వచ్చు. ఒకరి కోసం రెండు ఖాతాలను తీసేందుకు వీల్లేదు. బాలిక పదేళ్ల వయసు నుంచి ఖాతాను స్వయంగా నిర్వహించుకోవచ్చు.
వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా గుర్తింపు పత్రాలతో పాటు జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఖాతా తెరిచిన సంవత్సరం నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయవచ్చు.
ఒకవేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే, మీరు రెండు ఖాతాలలో మొత్తం రూ. 3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.
నగదు లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు.
డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు.
ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఖాతాను ‘డిఫాల్ట్ అకౌంట్’గా పరిగణిస్తారు.
ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోడానికి డిపాజిట్ మొత్తంతో పాటు రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ డిఫాల్ట్ అకౌంట్ ను 15 సంవత్సరాల పాటు క్రమబద్ధీకరించకపోతే, దాని మెచ్యూరిటీ సమయంలో ఖాతాలోని మొత్తం డిపాజిట్ పై పోస్ట్ ఆఫీస్ పొదుపు బ్యాంకు ఖాతాలకు వర్తించే వడ్డీ రేటును ఆకర్షిస్తుంది.
బ్యాంకుకు తగిన సూచనలు అందించడం ద్వారా ఆన్‌లైన్ నుంచి డిపాజిట్ చేయవచ్చు.
ఒకవేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే, ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. కానీ అదనపు మొత్తంపై వడ్డీ చెల్లించరు.
ఇదేవిధంగా, 21 సంవత్సరాల తర్వాత ఖాతాలో మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, ఆ మొత్తంపై కూడా వడ్డీ చెల్లించరు.
ప్రస్తుతం, వడ్డీ రేటు 8.4 శాతంగా ఉంది, ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ పథకాలపై వర్తించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉంటుంది.
ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు.
ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మీరు ఖాతాలో డబ్బును ఉపసంహరించుకునే వీలుంటుంది.
అయితే ఈ ఖాతాలో ప్రతి నెల 10 వ తేది కంటే ముందు నగదు డిపాజిట్ చేస్తే నెలంతటికీ వడ్డీ లబిస్తుంది.
ప్రతినెల 10 వ తేదీ నుంచి చివరి వరకు ఉన్న తక్కువ నగదుపై వడ్డీ లెక్కిస్తారు. అందుకే 10 వ తేదీకంటే ముందే డిపాజిట్ చేస్తే లాభం ఉంటుంది.
సుకన్య సమృద్ధిపై వడ్డీ రేటును ప్రభుత్వ నిర్ణయిస్తుంది కాబట్టి ఏ బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా వడ్డీ రేట్లు ఉంటాయి.
మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా అనగా 21 సంవత్సరాలు పూర్తైన తర్వాత కూడా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, దానిపై వడ్డీని చెల్లించరు.
సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్.. సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది అనుకుంటే :
సంవత్సరానికి రూ.1000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత అనగా మెచ్యూరిటీ సమయంలో రూ. 46,800 పొందవచ్చు.
అదేవిధంగా, సంవత్సరానికి రూ. 1,50,000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల తరువాత రూ. 70,20,000 సంపాదించవచ్చు.
సుకన్య సమృద్ధి యోజనలో ఉపసంహరణ, పన్ను, అవసరమైన డాక్యుమెంట్లు, ఎన్ఆర్ఐలకు ఎలా వర్తిస్తుంది వంటి మరిన్ని వివరాలను టోల్ ఫ్రీ నెంబరు-1800 266 6868ను సంప్రదించవచ్చు. లేదా దానికి సంబంధించి వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు..