Onion Prices: ఉల్లి ధరలపై కేంద్రం గుడ్ న్యూస్.. నాసిక్ నుంచి ప్రత్యేక రైళ్లు.. సామాన్యులకు భారీ ఊరట
దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు(Onion Prices) అమాంతం పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- V Santhosh Kumar
- Published on- August 24, 2026 / 11:45 AM IST
Union govt launches kanda express trains to control rising onion prices
- దేశవ్యాప్తంగా ఉల్లి ధరల పెరుగుదల
- కందా ఎక్స్‌ప్రెస్ ద్వారా రవాణా
- మార్కెట్లో ధరల నియంత్రణ చర్యలు
Onion Prices: దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో వర్షపాతం ప్రభావంతో ఖరీఫ్ పంట దిగుబడి తగ్గడం, రవాణా ఆలస్యం కావడం వల్ల మార్కెట్లో కొరత ఏర్పడి రిటైల్ ధరలు ఒక్కసారిగా మండిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాల్లో కిలో ఉల్లి ధర రూ. 60 దాటడంతో సామాన్యుడి వంటగది బడ్జెట్ తలకిందులైంది. ఈ ధరల మంటను చల్లార్చి, మార్కెట్లను స్థిరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది.
Moosarambagh Bridge: మూసారాంబాగ్ కొత్త వంతెన సిద్ధం.. ఈ నెలాఖరులోనే గ్రాండ్ ఓపెనింగ్!
‘కందా ఎక్స్‌ప్రెస్’ ప్రత్యేక రైళ్లు: నాసిక్ నుండి ప్రధాన నగరాలకు తరలింపు!
ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తన బఫర్ నిల్వలను రంగంలోకి దించింది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుండి ‘కందా ఎక్స్‌ప్రెస్’ పేరిట ప్రత్యేక రైళ్ల ద్వారా ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువహటి వంటి ప్రధాన నగరాలకు భారీగా ఉల్లిని(Onion Prices) రవాణా చేస్తోంది. నాఫెడ్ (NAFED), ఎన్‌సీసీఎఫ్ (NCCF) సంస్థల వద్ద సేకరించిన నిల్వలను సరఫరా తక్కువగా ఉన్న మార్కెట్లకు వేగంగా పంపడం ద్వారా స్థానిక మార్కెట్లలో ఉల్లి లభ్యతను పెంచి, ధరలు మరింత పైకి చేరకుండా అడ్డుకట్ట వేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయి:
దేశంలో ఉల్లితో పాటు చక్కెర ధరలు కూడా స్వల్పంగా పెరిగినప్పటికీ, ఆహార నిల్వల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వంతో పాటు రైతుల వద్ద కూడా వినియోగానికి తగినంత ఉల్లి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ప్రత్యేక రైళ్ల ద్వారా బఫర్ స్టాక్‌ను తరలించి ధరలను అదుపులోకి తీసుకొచ్చిన అనుభవం ఉందని, త్వరలోనే మార్కెట్లో ఉల్లి ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.
