ఉల్లిపాయల్ని తక్కువగా వాడండి అంటూ మంత్రిగారు ప్రజలకు సలహా ఇచ్చారు. ఉల్లి ధరల్ని అదుపు చేయలేక మంత్రిగారు ప్రజలకు ఈ సలహా ఇచ్చారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉల్లిపంటలు పాడైపోయాయనీ..స్టాక్ చేసిన ఉల్లిపాయలకు కూడా పాడైపోయాయనీ..ప్రజలంతా కొంతకాలం పాటు ఉల్లి పాయల్ని వాడకాన్ని తగ్గించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి పిలుపునిచ్చారు.
యూపీలోని హర్దోయీ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి అతుల్ గర్గ్… ‘ప్రజలంతా కొంతకాలం పాటు ఉల్లివాడకాన్ని తగ్గించాలని’ పిలుపునిచ్చారు. వర్షాల కారణంగా ఉల్లి పంటలు పాడయిపోయాయని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉల్లి దిగుబడి తగ్గిపోయాయనీ..దీంతో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోయాయనీ వివరణ ఇచ్చారు మంత్రిగారు.
ఉల్లి ధరలు త్వరలోనే తగ్గుతాయని ఈ పరిస్థితి చక్కబడుతుందని అన్నారు. ఉల్లి ఒక్కటే కాకుండా ఇంకా వందరకాల కూరగాయలున్నాయనీ..ఉల్లిపాయలు ధర ఎక్కువగా ఉందని బాధ పడకుండా వేరే కూరగాయాలు వాడుకోవాలంటే ప్రజలకు ఉచిత సలహా పారేశారు సదరు మంత్రిగారు. కాగా యూపీలో ఉల్లి కిలో ధర రూ. 60 నుంచి 70 వరకూ ఉండటంతో హోటళ్లలో ఉల్లి వాడకాన్ని తగ్గించారు. ఉల్లిపాయల ధరలు కొండెక్కటంతో పలు చాట్ సెంటర్లు మూతపడిన పరిస్థితి కూడా ఉంది.