జామా మసీదు వద్ద జాతీయగీతం.. వీడియో వైరల్‌

  • Publish Date - January 9, 2020 / 07:41 AM IST

ఢిల్లీలో బుధవారం (జనవరి 8, 2020) రాత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(JNU) ప్రొఫెసర్లు, విద్యార్థులకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కొన్నివేల మంది యువతీయువకులు పాల్గొన్నారు. లాల్‌ కాన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చవ్రీ బజార్‌ నుంచి జామా మసీదు వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. JNU విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

అంతేకాదు ర్యాలీ ముగింపు సమయంలో జామా మసీదు దగ్గర కొవ్వొత్తులు వెలిగించి జాతీయగీతాన్ని పాడారు.  ప్రస్తుతం జాతీయ గీతం పాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను మహ్మద్‌ అష్రఫ్‌ అనే యువకుడు తన ట్విట్టర్‌ లో పోస్టు చేశాడు. జాతీయ గీతాన్ని పాఠశాలలు, సినిమా థియేటర్లలో పాడటం అందరం చూశాం కానీ, ఫస్ట్ టైం మసీదు వద్ద జాతీయ గీతం పాడటం చూశాం అని క్యాప్షన్‌ పెట్టాడు.

ఆదివారం (జనవరి 5, 2020) తేదీ సాయంత్రం JNUలోకి ముసుగు ధరించి ప్రవేశించిన దుండగులు.. యూనివర్సిటీ విద్యార్థులపై కర్రలతో, రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు గాయపడ్డారు. ఇక ఇవాళ ర్యాలీకి JNU విద్యార్థులు పిలుపునివ్వడంతో యూనివర్సిటీ గేటు వద్ద పోలీసులు భారీగా ఉన్నారు.