Mamata Banerjee : పశ్చిమబెంగాల్‌లో మమత కోటను బద్దలు కొట్టిన బీజేపీ.. బెంగాల్ ముఖ్యమంత్రి అతనేనా?
West Bengal Mamata Banerjeeపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం కావడంతో.. పలువురు పేర్లు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి వినిపిస్తున్నాయి.
- Harish Thanniru
- Updated on- May 4, 2026 / 12:29 PM IST
west bengal election results 2026
West Bengal Election Results 2026 : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్‌షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 293 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మేజిక్ ఫిగర్ 148. అయితే, ప్రస్తుతం వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి అధికారం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వస్తే.. కాబోయే సీఎం ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది.
మమత కోటను బద్దలు కొట్టేందుకు ఈసారి బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. గత ఎన్నికలకు భిన్నంగా బీజేపీ అధిష్టానం ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కావడంతో సీఎం పదవికి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్ర పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థి ఎంపిక విషయాన్ని పూర్తిగా కేంద్ర పార్టీ అధిష్టానే చూసుకుంటుందని స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం కావడంతో.. పలువురు పేర్లు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి వినిపిస్తున్నాయి. వారిలో మొదటి పేరు సువెందు అధికారి. ఆయన టీఎంసీలో ఒకప్పుడు కీలక నాయకుడిగా కొనసాగారు. ఆ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన తరువాత సువెందు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. మమతా బెనర్జీని రాజకీయంగా సవాలు చేయడం ద్వారా పార్టీలో ఆయన ప్రాముఖ్యత మరింత పెరుగుతూ వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో సీఎం పదవికి సువెందు అధికారి పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది.
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడైన దిలీప్ ఘోష్ పేరుకూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రేసులో ఉంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన వారిలో ఇతను ఒకరు. వీరితోపాటు సుకాంత మజుందార్ పేరుకూడా ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లలో ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్ర పార్టీ నాయకత్వంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కలిసొచ్చే అవకాశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీరితోపాటు షామిక్ భట్టాచార్య పేరు కూడా బీజేపీ కేంద్ర అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ నలుగురిలో ఒకరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని బీజేపీలో వర్గాల్లో చర్చ జరుగుతోంది.
