జ్యోతిరాదిత్య సింధియా తండ్రి లాగే కాంగ్రెస్‌ను వదిలేశాడా?

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించడం అంటే దాదాపు బీజేపీలోకి (మార్చి 10)న ఎంటర్ అయినట్లే అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చరిత్రలో సేమ్ టు సేమ్ తండ్రి చేసినట్లే జ్యోతిరాదిత్య సింధియా చేస్తున్నారా అనిపిస్తుంది. 24ఏళ్ల క్రితం అంటే 1996లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా కాంగ్రెస్‌ను వీడిన సందర్భం అలానే ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలతోనే తండ్రి కొడుకులు ఇద్దరూ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 

అది 1996, మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న మాధవరావు సింధియా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో పార్టీకి రాజీనామా చేశారు. జైన్ హవాలా డైరీస్‌లో అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ పలువురు రాజకీయ నాయకులపై వచ్చిన విమర్శల్లో మాధవరావు కూడా ఉన్నారు. రూ.75లక్షల పెట్టుబడి పెట్టారనేది అభియోగం. 

1971 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఓటమి ఎరుగని మాధవరావుకు ఏప్రిల్-మే 1996 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ ఇవ్వడానికి నిరాకరించింది. అంటే 26ఏళ్ల వయస్సు నుంచి లోక్‌సభ బరిలో ఉన్నాడు మాధవరావు అప్పుడే జ్యోతిరాధిత్య సింధియా కూడా పుట్టారు. 1971లో భారతీయ జన సంఘ్ అభ్యర్థిగా గుణ నియోజకవర్గం నుంచి గెలిచిన మాధవరావు 1977లో స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి జయకేతనం ఎగరేశారు. 

ఆ తర్వాత 1980లో ఇందిరా గాంధీ కాంగ్రెస్-1లో గెలిచారు. 1984, 1989, 1991 సంవత్సరాల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎంపీగా గెలుస్తూనే వచ్చారు. 1996లో రెబల్‌గా మారి కాంగ్రెస్ పార్టీని వదిలేయడమే కాకుండా మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్(MPVC) ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి కాంగ్రెస్ నిలబెట్టిన శశి భూషణ్ వాజ్‌పేయిని ఓడించి ఏడో సారి లోక్‌సభలోకి ఎంటర్ అయ్యారు. 

ఆ ఎన్నికల్లో బీజేపీ.. సమతా పార్టీ, శివసేన, హర్యానా వికాస్ పార్టీలతో కూటమిగా ఏర్పడి 161సీట్లను దక్కించుకుంది. ఆ సమయంలో మధ్యప్రదేశ్ లో ఉన్న 40సీట్లలో 27సీట్లను బీజేపీ దక్కించుకుంటే కాంగ్రెస్ కు కేవలం 8సీట్లు మాత్రమే దక్కాయి. 13రోజుల్లో అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో దేవగౌడ ప్రధానిగా బాధ్యతాలు అందుకున్నారు. 

ఆ సమయంలో MPVC యునైటెడ్ ఫ్రంట్‌కు మద్దతిచ్చింది. దేవగౌడ, ఐకే గుజ్రాల్ హయాంలో మద్దతు ఇచ్చారు కానీ, ఏ మంత్రి పదవిని ఆశించలేదు. 1998లో కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా సీతారాం కేసరి తప్పుకున్న తర్వాత మాధవరావు సింధియా మరోసారి కాంగ్రెస్ తో కలిశారు. MPVCని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2001లో జరిగిన ప్రమాదంలో మరణించారు. అప్పటి వరకూ కొత్త కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి ముఖ్య సలహాదారుగా ఉండేవారు. 

ఇదే కోవలో నడుస్తున్న జ్యోతిరాదిత్య సింధియా వ్యవహారం అధిష్టానంపై కోపంతో బీజేపీ గుమ్మం తొక్కినట్లుగా కనిపిస్తుందని విశ్లేషకుల అంచనా. కెరీర్ బీజేపీలోనే కొనసాగిస్తారా అనేది ప్రశ్నార్థకమే.