లోక్‌సభ సభాపతి విషయంలో బీజేపీ తగ్గుతుందా.. నెగ్గుతుందా?

కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నెక్ టు నెక్ మెజార్టీతో పవర్‌లోకి రావడంతో.. స్పీకర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.

Who will be next Lok Sabha Speaker

Lok Sabha Speaker Post: లోక్‌సభలో స్పీకర్‌ పదవి ఈసారి ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నెక్ టు నెక్ మెజార్టీతో పవర్‌లోకి రావడంతో.. స్పీకర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఓ వైపు ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి ఆశిస్తుంటే.. ప్రతిపక్షం నుంచి ఇండియా కూటమి కూడా అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి స్పీకర్ పదవి హాట్ టాపిక్‌గా మారింది.

సభ నిర్వహణలో కీలకమైన సభాపతి పదవిని తన దగ్గరే పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలా అయితే డిప్యూటీ స్పీకర్‌ పదవి కోసం విపక్షం డిమాండ్‌ చేస్తోంది. లోక్‌సభలో ఎన్డీయేకు 293 సీట్లు, ఇండియా కూటమికి 233 సీట్లు ఉన్నాయి. ఈ నెల 24 నుంచి 18వ లోక్‌సభ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. రాష్ట్రపతి నియమించే ప్రొటెం స్పీకర్‌ ముందుగా కొత్త సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ కీలకంగా నిలిచాయి. ఆ రెండు పార్టీలు ఆ పదవిని ఆశించినట్లు వార్తలు వచ్చాయి. గత లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవిని తమ కూటమికి ఇవ్వకపోతే.. ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని పోటీకి దింపాలని విపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓం బిర్లాకే మరో చాన్స్?
స్పీకర్‌ పదవి బీజేపీ దగ్గరే ఉంటే, ఓం బిర్లాకే మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ ఉంది. ఆయన కాని పక్షంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. విపక్షం పట్టుబట్టి పోటీపెడితే మాత్రం లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక నిర్వహించబడితే ఇదే మొదటిసారి కానుంది. గతంలో పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాలు ఏర్పడినా.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సమయాల్లోనూ స్పీకర్ పదవి ఎన్నిక ఏకగ్రీవం అయింది.

Also Read: మీరే కదా నన్ను ఓడించారు.. బీజేపీ ఎమ్మెల్యేతో ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్

బీజేపీ కసరత్తు.. రంగంలోకి రాజ్‌నాథ్
స్పీకర్‌ పదవిపై ఎన్డీయే పక్షాలతో పాటు విపక్షాల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించే బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. అందుకే రాజ్‌నాథ్ సింగ్‌ ఆధ్వర్యంలోఎన్డీయే మంత్రులు సమావేశమై లోక్‌సభ స్పీకర్‌ పదవిపై చర్చించారు. ఈ నెల 24న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక కోసం లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. అంతకముందే స్పీకర్‌ పదవిపై తేల్చేందుకు కసరత్తు చేస్తోంది బీజేపీ. తమకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వకపోతే స్పీకర్‌ పదవికి అభ్యర్ధిని నిలిపేందుకు విపక్ష ఇండియా కూటమి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే స్పీకర్ పదవిని తాము ఉంచుకుని.. డిప్యూటీ స్పీకర్ పోస్ట్‌ను మిత్రపక్షాలకు ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు