కరోనా ఎంట్రీతో భారత్‌లో కలకలం మొదలైంది. మందుమాకూ లేని వైరస్‌కి ముకుతాడు వేసే దారిలేక.. కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతానికి వైరస్ ఫస్ట్
కరోనా ఎంట్రీతో భారత్‌లో కలకలం మొదలైంది. మందుమాకూ లేని వైరస్‌కి ముకుతాడు వేసే దారిలేక.. కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతానికి వైరస్ ఫస్ట్ స్టేజ్‌లోనే ఉన్నా.. అది దశలు దాటితే తట్టుకునే శక్తి మనకు ఉందా..? చైనా తరహాలో వైరస్‌ను నియంత్రించే కెపాసిటీ ఉందా..? తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. ఖండాంతరాలు చుట్టేస్తున్న కిల్లర్ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ వ్యూహం రచించారు. అందులో భాగమే జనతా కర్ఫ్యూ.
ఏ నలుగురు కలిసినా జనతా కర్ఫ్యూ గురించి చర్చ:
ప్రధాని మోడీ సందేశంతో జనతా కర్ఫ్యూ దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఏ నలుగురు కలిసినా ఇదే మాట.. ఇదే చర్చ. కరోనా ప్రాణాంతక వైరస్‌గా పరిణమించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సోకిన మహమ్మారి… వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పుడు మన దేశాన్ని కకావికలం చేసేందుకు కాచుకూర్చుంది. కానీ ఏమాత్రం ఉపేక్షించకుండా కరోనా కట్టడికి భారత్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. మొదటినుంచి మెరుగైన చర్యలు తీసుకుంటున్న కేంద్రం ఇప్పుడు మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనా నియంత్రణకు ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవడమే శరణ్యమని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అందులో భాగంగానే మార్చి 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూని పాటించాలని కోరారు.
జనతా కర్ఫ్యూ వల్ల ప్రయోజనం ఏంటి?
ఇంతకీ ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకి ఎందుకు పిలుపునిచ్చారు..? దీని వల్ల జరిగేదేంటి..? ఒరిగేదేంటి..? కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి సత్పలితాలు ఉండబోతున్నాయి..? ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స కంటే జనతా కర్ఫ్యూ అంత పవర్‌ఫుల్లా..? భారత్‌లో కరోనా ప్రభావం అంతగా లేదు… అలాగని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులన్నారు ప్రధాని మోడీ. కరోనాకు మందు లేదు.. ధృడమైన సంకల్పంతోనే దాన్ని జయించాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టేనని, రానున్న రోజుల్లో ముఖ్యమైన పనులుంటే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే తమ పనులు చేసుకోవాలని.. ఒకరికొకరు సామాజిక దూరం పాటించాలన్నారు మోడీ.
ఉదయం 7గం.ల నుంచి రాత్రి 9గం.ల వరకు జనతా కర్ఫ్యూ:
ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు మోడీ. ఈ సరికొత్త విధానం, నినాదం.. ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలే చేసుకునే కర్ఫ్యూ అన్నమాట. ఈ కర్ఫ్యూనే కరోనాపై అతిపెద్ద యుద్ధమన్నారు ప్రధాని.
3 నుంచి 14 గంటల వరకు బతికి ఉండే వైరస్:
ఇంతకీ జనతా కర్ఫ్యూ ఇచ్చే సందేశమేంటి..? ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బయటి వాతావరణంలో ఎంత సేపు బతికి ఉంటుందన్నదానిపై సరైన సమాచారం ఇంతవరకూ లేదు. కొంతమంది మంది 3 గంటల వరకే బతికి ఉంటుందంటే.. ఇంకొంతమంది 12 గంటలకు పైగా జీవించవచ్చని చెబుతున్నారు. పూర్తిగా కొత్త వైరస్ కావడంతో.. దాని లక్షణాలను ఇంకా పూర్తిగా ఎవరూ కనిపెట్టలేదు. అందుకే గరిష్టంగా 12 గంటల పాటు.. వైరస్‌ను ఎవరూ ముట్టుకోకపోతే.. చనిపోతుందన్న అంచనా ఎక్కువమందిది. ఈ మధ్యకాలమే మనకి చాలా కీలకం. ప్రస్తుతం ఒకట్రెండు గంటల్లోనే వైరస్ ఉన్న స్థలాల్లోకి ఎవరో ఒకరు వెళ్లడం గానీ.. లేదంటే వైరస్ ఉన్న వస్తువుల్ని టచ్ చేయడం గానీ జరుగుతుంది. ఈ కారణంగానే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒంట్లోకి చేరి రోజుల వ్యవధిలో ఊపిరి సలపకుండా చేసి ఊపిరాపేస్తుంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే కర్ఫ్యూనే అసలు సిసలు మందు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
జనతా కర్ఫ్యూ వెనుక శాస్త్రీయత:
ఈ కర్ఫ్యూ వెనుక శాస్త్రీయత ఉందని నిపుణులు అంటున్నారు. ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే 14 గంటలు కర్ఫ్యూ ఉంటుంది. ఇన్ని గంటల పాటు ప్రజలు ఇంట్లోనే ఉండటం(స్వీయ నిర్బంధం) వల్ల గాల్లోని వైరస్ ఎవరికీ సోకదని చెబుతున్నారు. అలాగే వైరస్ వ్యాపి గొలుసు(coronavirus transmission chain) తెగిపోతుందట. అంటే మూడో దశను అడ్డుకున్నట్టు అవుతుందన్న మాట. ఆ తర్వాత కరోనా వైరస్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే దేశంలోని ప్రతి పౌరుడు తప్పకుండా జనతా కర్ఫ్యూని పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.
నిర్దేశిత టైమ్‌లో పనులు చేయకుండా ఉంటే బెటర్:
అత్యవసర పనులు ఉన్నవాళ్లు ఉదయం 7కి ముందు.. రాత్రి 9గంటల తర్వాత చూసుకోవడం ఉత్తమం. కానీ నిర్దేశించిన సమయంలో మాత్రం ఇంటికే పరిమితం అయ్యేలా చూసుకోవడం మంచిది. చాలా దేశాల్లో పబ్లిక్ ప్రాంతాల్లో శానిటైజర్స్ స్ప్రే చేయడం, నీటితో క్లీన్ చేయడం చూస్తున్నాం. అది ప్రాక్టికల్‌గా ఓకే. కానీ మనం 12గంటల పాటు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్లకుండా ఉంటే.. వైరస్ దానంతట అదే చనిపోతుంది. జనం కూడా ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవ్వరు కాబట్టి.. ఆ రోజు ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాపించదు.
మన కుటుంబాన్ని, మన దేశాన్ని కాపాడుకున్నట్టే:
14గంటల సమయంలో మనం ఓ రకంగా వైరస్‌తో యుద్ధం చేసినట్టే. ఈ యుద్ధంలో అందరూ చేయి చేయి కలిపితేనే .. మన పిల్లల్ని, మన వృద్దుల్ని, మన కుటుంబాలను, అంతిమంగా మనదేశాన్ని కాపాడుకున్నవాళ్లం అవుతాం. ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకుని.. ఆదివారం ఉదయం 7నుంచి సాయంత్రం 9గంటలకు జనతా కర్ఫ్యూను పాటించాలంటున్నారు వైద్యులు.
యుద్ధాల్లో కంటే వైరస్ సోకి చనిపోయిన వాళ్లే ఎక్కువ:
కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌కి ఎలాంటి మందు లేదు. ఇప్పటికీ చాలా దేశాలు వైరస్ విరుగుడికి పరిశోధనలు జరుపుతున్నాయి. కానీ ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గతంలో మూడు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. వాటిలో చనిపోయిన జనాల కంటే.. మహమ్మారి బారినపడి చనిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ. అందుకే వైరస్‌ను ఆదిలోనే కట్టడి చేయకుంటే.. అది మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు. చైనా, ఇటలీ, ఫ్రాన్, అమెరికా లాంటి దేశాలు వైరస్ నియంత్రణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. అయినప్పటికీ చైనా మినహా మిగతా దేశాల్లో పెద్దగా మార్పేం రావడం లేదు. ఇప్పుడు మన దేశంలో పైసా ఖర్చు లేకుండా కేవలం జనతా కర్ఫ్యూతోనే దాన్ని నివారించుకునే ఛాన్స్ ఉంది. అందుకే మీకోసం నేను.. నా కోసం మీరు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనండి.. కరోనా వైరస్‌ను తరమికొట్టండని పిలుపునిస్తోంది టెన్ టీవీ.