యడ్యూరప్ప సీరియస్: రాజీనామా చేసేస్తా.. లింగాయత్ గురువు చెప్పినట్లు చేయాలా

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంగళవారం రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే.. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మురుగేశ్ నిరానీను క్యాబినెట్‌లోకి తీసుకోవాలంటూ లింగాయత్ సీర్ వచనానంద స్వామి సూచించాడు. ఒకవేళ తీసుకోకపోయినట్లు అయితే మా కమ్యూనిటీ నుంచి ఎటువంటి మద్ధతు రాదని హెచ్చరించాడు. పంచమాలి సెక్టార్‌లో జరిగిన ఓ సభా కార్యక్రమంలో సీఎం యడ్యూరప్పతో పాటు లింగాయత్ సాధువు పలువురు హాజరయ్యారు. 

వేల మంది హాజరైన కార్యక్రమంలో సీఎంతో సాధువు ఇలా.. ‘మురుగేశ్ నిరానీ నీ పక్కన రాయిలా నిలబడతాడు. అతనిని క్యాబినెట్‌లోకి తీసుకో. లేదంటే పంచమశాలీ లింగాయత్‌లు నీకెటువంటి సపోర్ట్ చేయరు’ అని హెచ్చరించాడు. ఇదే సభలో వారి కమ్యూనిటీకి న్యాయం చేయాలంటూ సీఎంను డిమాండ్ చేశారు. 

దీనిపై సీరియస్ అయిన యడ్యూరప్ప విన్న క్షణాల్లోనే సమాధానమిచ్చారు. ‘నన్ను బెదిరించాలనుకోవద్దు. మీరు సలహాలు మాత్రమే ఇవ్వగలరు. కానీ, బెదిరింపులకు కాదు’ అని ఘాటు సమాధానమిచ్చారు. ‘మంత్రులతో కలిపి 17మంది ఎమ్మల్యేలు త్యాగాలు చేసి వనవాసంలో ఉన్నారు. మిగిలిన మూడేళ్ల పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసేందుకు నాకు సహకారం అందించమనండి. లేదంటే నేను రాజీనామా చేసేస్తా.. ఎందుకంటే నేను అధికారానికి బానిసను కాదు’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

ఎమ్మెల్యే మురుగేశ్ మాట్లాడుతూ.. ‘సీఎం మాకు తండ్రి లాంటి వారు. ఆయన ఏదైనా చెప్తే అది మా మంచి కోసమే’ అని సింపుల్‌గా తప్పించుకున్నారు.