Womens Reservation Bill 2026 : మహిళా బిల్లుపై బీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఇదే.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

Womens Reservation Bill 2026 : మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మరి బీజేపీ తర్వాతి ప్లాన్ ఏంటి.. ఏం చేయబోతుంది

Women reservation bill this is the bjp next plan on this issue

Womens Reservation Bill 2026 : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరో రెండు బిల్లుల ఆమోదం కోసం రెండు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండో రోజైన శుక్రవారం సాయంత్రం తొలుత లోక్‌సభలో మహిళా బిల్లుపై ఓటింగ్ జరిగింది. మొత్తం 528 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి.

అయితే బిల్లు ఆమోదం పొందాలంటే (528లో 2/3 వంతు) అంటే 352 ఓట్లు రావాల్సి ఉంది. కానీ లోక్‌సభలో మహిళా బిల్లుకు అనుకూలంగా వచ్చింది మాత్రం 298 ఓట్లే. మరో 54 ఓట్ల దూరంలో బిల్లు ఆగిపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో ఈ బిల్లుకు అనుబంధంగా, ఇంటర్ లింక్‌గా ఉండే మరో రెండు బిల్లులను (డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు) ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

బీజేపీ వాదన..

2029 నాటికి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుందని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. బిల్లు వీగిపోవడంతో.. ఎన్డీఏ దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని… కాంగ్రెస్ కావాలనే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుందని జనంలోకి బలంగా ప్రచారం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ప్రారంభించింది. మహిళలకు లభించాల్సిన చరిత్రాత్మకమైన అవకాశాన్ని అడ్డుకున్నారని, దేశ నారీమణులు గత 30 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం చేజారిందని విమర్శిస్తున్నారు.

మరీ ముఖ్యంగా మహిళలు ఉన్నత స్థానాల్లో ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఇప్పటికే బీజేపీ జనంలోకి బలంగా ప్రచారం చేస్తోంది. అంతేకాక, ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద ముల్లాలు ఆందోళన చేస్తే రాజీవ్ గాంధీ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేకపోయిందనే అంశాన్ని కూడా ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు. దీనితో పాటు బీజేపీ వచ్చాక ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసిందని ప్రచారం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే 2023 నాటి బిల్లును యథాతథంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించవచ్చు.

తదుపరి వ్యూహం

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దీనిపై కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్డీఏ కూటమి.. 2023లో తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు కొన్ని మార్పులు చేస్తూ కొత్త రాజ్యాంగ సవరణ చేయాలనుకుంది. కానీ, ఈ సవరణకు ఆమోదం లభించలేదు.

ఇప్పుడు 2023లో పాసైన బిల్లు యథావిధిగా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల్లో (543) మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని భావిస్తే మళ్లీ కొత్తగా సభ ముందుకు బిల్లు తీసుకురావచ్చు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023.. ఏప్రిల్ 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ బిల్లు వీగిపోయినప్పటికీ బీజేపీ అనుకున్నది సాధించింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే ఎన్డీఏ.. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చినట్లు ప్రచారం చేసుకునేది, ఇప్పుడు వీగిపోవడంతో విపక్షాలను ఇరుకున పెట్టడానికి అవకాశం లభించింది. ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది అంటున్నారు. ఇప్పటికే దీనిపై ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు పొందేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది.