పెళ్లికూతుళ్లను అందంగా అలకరించకపోతే టీచర్లకు పనిష్మెంట్! : యూపీ సర్కార్ వింత ఆదేశాలు

  • Publish Date - January 28, 2020 / 04:52 AM IST

పెళ్లి కుమార్తెలను అందంగా అలంకరించకపోతే టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అదేంటీ టీచర్లకు పెళ్లి కుమార్తెల డెకరేషన్ కు సంబంధమేంటో చూద్దాం.  

యూపీలోని సిద్దార్థనగర్‌కు చెందిన మహిళా టీచర్లకు పెళ్లి కుమార్తెలను అందంగా ముస్తాబు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాల కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అధికారులు తరువాత తీసుకోవాల్సిన చర్యలపై మల్లగుల్లాలు పడుతున్నారు. 

వివరాల్లోకి వెళితే..యూపీలోని సిద్దార్థనగర్‌లో  సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ యోజన కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ విచిత్రమైన ఆదేశాలు జారీచేసింది. ఈ సామూహిక వివాహాలకు చెందిన పెళ్లికూతుళ్లకు ముస్తాబు చేసే బాధ్యతను 20 మంది మహిళా టీచర్లకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ జారీ చేసిన ప్రకటనలో 20 మంది మహిళా ఉపాధ్యాయుల పేర్లతో పాటు వారు వర్క్ చేసే స్కూల్స్ పేర్లు ఉన్నాయి. ఆ టీచర్లు ఉదయం 9 గంటలకల్లా వివాహాలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలని ఉంది. 

ఈ ఆదేశాలపై టీచర్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుశీల్ పాండే  తీవ్రంగా ఖండించారు.వధువులను అలంకరించమని టీచర్లకు ఆదేశాలివ్వటం సరైందికాదని అన్నారు. కాకపోతే పెళ్లి కుమార్తెను అలకరించటానికి సహాయం చేయవచ్చుగానీ..సరిగా అలకరించకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అనటం సరైందికాదని సూచించారు.  

ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఆర్డర్ పేపర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో విద్యాశాఖలో కలకలం మొదలయ్యింది. దీంతో సిద్దార్థనగర్‌కు చెందిన ఓ అధికారి సూర్యకాంత్ త్రిపాఠి ఈ ఆదేశాలను రద్దు చేశారు.

 

​​