ట్రిపుల్ తలాఖ్ బాధితులకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరైతే మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని ముందు భార్యను హింసిస్తుంటారో వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన పోలీసులు పరిష్కరించకుండా వదిలేసిన ట్రిపుల్ తలాఖ్ కేసు బాధితులకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ వసతి కల్పిస్తామని ప్రకటించారు.
దాంతోపాటు వీరికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ డిపార్ట్‌మెంట్‌లతో పాటు, గృహ, మైనారిటీ వ్యవహరాల శాఖలను కోరారు. సంవత్సరానికి ఈ బాధితుల సహాయార్థం రూ.6వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇలా వారు ఆర్థికంగా నిలదొక్కుకునేంత వరకూ సాయం అందిస్తూనే ఉంటారట.
వారి పిల్లలు, బాధితులు ఇన్సూరెన్స్ స్కీం వర్తిస్తుందని తెలిపారు. వీరందరికీ ఆయుష్మాన్ భారత్ వంటి స్కీంల కింద రూ.5లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉందని హామీ ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు పంపేసిన మహిళలకు పీఎం ఆవాస్ యోజన, సీఎం ఆవాస్ యోజన పథకాల కింద వసతి కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే వఖ్ఫ్ నియమాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే పనిలో ఉన్నట్లు వివరించారు.