ఏపీ ప్రభుత్వం, బీసీజీ కమిటీ రిపోర్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీజీ రిపోర్టు ఒక చెత్త కాగితం..ఈ రిపోర్టును ప్రజలు నమ్మాలా అని అన్నారు.
ఏపీ ప్రభుత్వం, బీసీజీ కమిటీ రిపోర్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీజీ రిపోర్టు ఒక చెత్త కాగితం..ఈ రిపోర్టును ప్రజలు నమ్మాలా అని అన్నారు. బీసీజీ రిపోర్టును భోగిమంటల్లో తగలబెట్టండని పిలుపు ఇచ్చారు. శనివారం (జనవరి 4, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీజీ ఎప్పుడు వేశారు? దానికి తలా, తోక ఉందా అని మండిపడ్డారు. తప్పుడు కమిటీలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎవరిని మోసం చేయడానికి హై పవర్ కమిటీ వేశారని ప్రశ్నించారు.
బీసీజీ నివేదికతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. క్లయింట్ కు ఏది కావాలో బీసీజీ అదే రాసిందన్నారు. బీసీజీ రిపోర్టును కేబినెట్ అధ్యయనం చేస్తుందా అని ప్రశ్నించారు. అజయ్ కల్లాం చెప్పినట్లు జీఎన్ రావు కమిటి రిపోర్టు ఇచ్చిందని ఆరోపించారు. మూడు రాజధానులు చేయడానికి మీకు అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా? అని మండిపడ్డారు.
అమారావతిని చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాజధానికి రూ.లక్షా 10 వేల కోట్లు అవుతాయా అని ప్రశ్నించారు. అంత ఖర్చు అవుతుందని ఎవరు చెప్పారని నిలదీశారు. అమరావతిలో అన్ని హంగులు ఉన్నాయన్నారు. రాజ్ భవన్ ఉంది..డీజీపీ ఆఫీస్ ఉందని తెలిపారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు.
విజయసాయిరెడ్డి అల్లుడితో సంబంధాలు ఉన్న కన్సల్టెన్సీ నివేదికకు విశ్వసనీయత లేదన్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును అడ్డుకున్నది వైసీపీనేనని అన్నారు. రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటారా అని మండిపడ్డారు. ఎమర్జెన్సీ అసెంబ్లీ పెడతారంట అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మీ నాటకాలు ఆపాలన్నారు. మహిళలపై నిన్నటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాజధాని రైతు గుండెపోటుతో చనిపోవడం బాధాకరం అన్నారు.