ఏడాది కూడా కాలేదు..అప్పుడే షురూ : జగన్ మేల్కొకపోతే భారీ నష్టం తప్పదు

గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.

  • Publish Date - February 27, 2020 / 11:50 PM IST

గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.

గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు. పరిపాలనలో బిజీగా ఉన్న అధినేత మాట కూడా వినిపించుకోకుండా గ్రూపులు కట్టి.. మరీ రచ్చకెక్కుతున్నారు. ఇందులో వారు వీరు అని తేడా లేదు.. జూనియర్ల నుంచి సీనియర్ల వరకూ అందరూ పోటీ పడుతున్నారు. 

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు:
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాబోతోంది. ప్రజల మన్ననలు పొందాలని సీఎం జగన్ అనేక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలను సైతం అన్ని కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేస్తూ రానున్న స్థానిక ఎన్నికలలో తమ సత్తా చాటేలా సీఎం అడుగులు వేస్తున్నారు. ఒకపక్క, అధినేత పాలనలో బిజీగా ఉంటే, మరోపక్క అనేక ప్రాంతాలలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరితో ఒకరు సఖ్యతగా ముందుకు వెళ్లాలని అధినేత చెప్పిన మాటలు పెడచెవిన పెడుతున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్య ప్రదర్శనకు సిద్ధం అవుతున్నారట. దీంతో వైసీపీ ముఖ్యనేతల మధ్య విభేదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే రజిని మధ్య విభేదాలు:
అమరావతి ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో అనేకమంది ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. గతంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేశ్‌ మధ్య పోరు సీఎం వరకు వెళ్లింది. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, విడదల రజిని మధ్య విభేదాలు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు విషయంలోనూ వర్గపోరు కనిపించింది. ఇప్పుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి, ఆయన పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలకి మధ్య ప్రతి చిన్న విషయంలో పంతాలు పెరిగిపోతున్నాయని వైసీపీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. 

Also Read | నేడు పోలవరానికి సీఎం జగన్‌..క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల పరిశీలన

వర్గాలుగా విడిపోతున్న వైసీపీ కార్యకర్తలు:
రోజుకొక ప్రాంతంలో ప్రజాప్రతినిధుల మధ్యనే కాకుండా.. జిల్లా ఇన్‌చార్జులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యనేతలకు, ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి. వీటికి కారణం నియోజవర్గంలో పైచేయి సాధించాలనే ఉద్దేశమేనని అంటున్నారు. నేతల విభేదాల కారణంగా కార్యకర్తలు కూడా వర్గాలుగా విడిపోతున్నారనే చర్చ పార్టీలో జోరందుకుంది. ఒకవైపు అధినేత జగన్ స్థానిక ఎన్నికల కోసం నేతలందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరుతున్నారు. కానీ నేతలేమో బాహాటంగానే తమ విభేదాలను ప్రదర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు ముఖ్యనేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఇలా జరుగుతోందని కార్యకర్తలు అంటున్నారు. 

ప్రజల్లో చులకన అయిపోతామనే భయం:
ప్రజా ప్రతినిధులు తమ పరిధుల విషయంలో రచ్చ చేస్తున్నారట. కొందరు కొత్తవారు కావడంతో నియోజవర్గంలో తమ హవానే నడవాలని, లేకపోతే ప్రజలలో చులకన అయిపోతామేమో అనే ఆలోచనతో ఎవరొచ్చినా అడ్డుకుంటున్నారట. ఈ సమస్యలన్నింటీకి అధినేత జగన్‌ ఒక రోజు సమాధానం ఇస్తారని, అప్పుడు ఎవరి పని వాళ్లు చేసుకుంటారని కొందరు నేతలు అంటున్నారు. అయితే, జిల్లా ఇన్‌చార్జిలు సైతం నేతల మధ్య సఖ్యత తీసుకురావడంలో పూర్తిగా విఫలం అవుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విభేదాలన్నీ ఎప్పటికి సమసిపోతాయోనని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. 

Also Read | ఏపీలో విలేజ్ క్లినిక్ లు..ఉచితంగా వైద్యం