జగన్ దుర్మార్గాలకు మోడీ, కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
అమరావతి : జగన్ దుర్మార్గాలకు మోడీ, కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైసీపీ మనపై తెలంగాణలో కేసులు పెట్టే స్థితికి వచ్చిందన్నారు. అమరావతిలో టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల టీడీపీ సమాచారం కంప్యూటరీకరించామని చెప్పారు. ఆ సమాచారాన్ని టీసర్కార్ సాయంతో వైసీపీ దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఓటమి భయంతోనే మన ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు.
8 లక్షల టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్రపన్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమికి అంగీకరించిందన్నారు. మనం సాంకేతికను ప్రోత్సహిస్తుంటే.. వాళ్లు సైబర్ క్రైంను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారోనని అనుమానం వ్యక్తం చేశారు. బోగస్ ఓట్ల తొలగింపునకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.