మండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోయే ఆ ఇద్దరికి సీఎం జగన్ బంపర్ ఆఫర్

ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్‌ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న

  • Publish Date - February 1, 2020 / 03:39 PM IST

ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్‌ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న

ఎడమ చేత్తో చెంప ఛెళ్లుమనిపించి కుడి చేత్తో ఝండూ బామ్‌ రాసినట్టుంది ఈ వ్యవహారం.. మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదంలో పడి తలలు పట్టుకున్న వారికి మాంచి ఝండూ బామ్‌ లాంటి పరిష్కారం ఉందంటున్నారు ముఖ్యమంత్రి గారు. అనుకోని వరంలా తొందర్లో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాలు కంటి ముందు కదలాడాయి. ఇంకేం.. ఓ రెండు మీకే అని హామీ ఇచ్చేశారు. అయినా మంత్రి పదవులిచ్చినా.. రాజ్యసభ సీట్లు ఇచ్చినా… అప్పట్లో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడిన వారికే కదా.

పదవులు కోల్పోనున్న ఆ ఇద్దరు:
ఏపీలో అనేక ఉత్కంఠతల నడుమ శాసనసభలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందింది. దీంతో చర్చ అంతా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించే నడుస్తోంది. మండలి రద్దు చేయాలని భావించడంతో ఇప్పుడు సీఎం జగన్ వీరిద్దరికీ ఎలా న్యాయం చేస్తారనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. మండలి రద్దు విషయంలో జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలే వేస్తున్నారని పార్టీ నేతలు, మంత్రులు అంటున్నారు. పార్లమెంటు కూడా ఆమోద ముద్ర వేసిన తర్వాత మండలి రద్దు అనివార్యమైతే మంత్రులు సైతం వారి పదవులు కోల్పోతారు. కానీ, వారిద్దరికీ సీఎం జగన్‌ బంపర్ ఆఫర్ ఇచ్చారని పార్టీలో అనుకుంటున్నారు.

ఒకరు త్యాగాలు చేస్తే… మరొకరు జగన్ తో జైలుకెళ్లారు:
మండలి రద్దు ప్రక్రియ పూర్తయితే మంత్రి పదవులు కోల్పోయే మోపిదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లకు జగన్ ఎలాంటి న్యాయం చేస్తారా అనే దానిపై జరుగుతోంది. దీనిపై జగన్‌ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారట. వారిద్దరినీ రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో జగన్‌ ఉన్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణకు ఈ విషయంలో సీఎం జగన్‌ స్పష్టమైన హామీ ఇచ్చారట. వీరి విషయంలో జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఉందంటున్నారు పార్టీ నేతలు. పార్టీ ఆరంభం నుంచి ఇరువురు సీఎం జగన్ ఆదేశాలతో అనేక త్యాగాలకు సిద్ధపడ్డారని పార్టీ ప్రారంభంలో మంత్రి పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయగా, మోపిదేవి వెంకటరమణ సైతం జగన్ తో జైలుకు సైతం వెళ్లారని గుర్తు చేస్తున్నారు.

వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డిలకు రాజ్యసభ చాన్స్‌:
గతంలో పార్టీకి, తనకు అండగా నిలిచినందున వారిద్దరినీ రాజ్యసభకు పంపించి మంత్రి పదవులు కోల్పోవడం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని జగన్‌ భావిస్తున్నారట. వచ్చే నెలలో రాజ్యసభకు ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఆ స్థానాలకు మోపిదేవి, సుభాష్‌ లను ఎంపిక చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తునట్లు సమాచారం. మంత్రులు రాజీనామా చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో వారితో రాజీనామా చేయించి, నెల రోజుల వ్యవధిలోపు రాజ్యసభకు పంపేందుకు జగన్ ప్లాన్‌ సిద్ధం చేశారంటున్నారు. వీరితో పాటు భర్తీ కాబోయే మరో రెండు స్థానాలకు కూడా పేర్లు ఖరారు చేశారట. ఒకరు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మరొకరు అయోధ్య రామిరెడ్డి అని చెబుతున్నారు. 

మంత్రులతో పాటు వైవీ, అయోధ్య రామిరెడ్డి విషయంలోనూ జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డికి 2019 ఎన్నికల్లో మాత్రం టికెట్‌ ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే ఆయన్ను టీటీడీ చైర్మన్‌గా నియమించారు. అయోధ్య రామిరెడ్డి విషయంలోనూ జగన్ కీలక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారట. ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడైన అయోధ్య రామిరెడ్డి 2014 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలని డిసైడ్‌ అయ్యారట. అంతే కాకుండా మూడు రాజధానుల నిర్ణయంతో ఆళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే ఆయన సోదరుడికి అవకాశం ఇస్తున్నారని అంటున్నారు.