ఏపీ సీఎం జగన్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎం అహ్మదాబాద్ తో జగన్
ఏపీ సీఎం జగన్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో జగన్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఐఐఎం(ఎ) ప్రొఫెసర్ సుందరపల్లి నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ సంతకాలు చేశారు. ఈ బృందంలోని నిపుణులు ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతికి ఆస్కారం ఉందో గుర్తిస్తారు. అలాగే అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలుపై అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ గా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. మరోవైపు ఏసీబీని మరింత బలోపేతం చేసే దిశగా చట్ట సవరణకు జగన్ ప్రభుత్వం రెడీ అవుతోంది.
అవినీతిరహిత, పారదర్శక పాలనకు సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించడానికి, అవినీతి నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం దేశంలోనే ప్రముఖ మేనేజ్ మెంట్ సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో అహ్మదాబాద్ ఐఐఎం ప్రజా విధానాల బృందం (పబ్లిక్ సిస్టమ్స్ గ్రూపు) ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ సంతకాలు చేశారు. 2020 ఫిబ్రవరి మూడో వారం నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బృందం తన నివేదికను అందిస్తుంది.
అహ్మదాబాద్ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. అవినీతి నిర్మూలన వల్ల అంతిమంగా పేదలకు, సామాన్యులకు లబ్ది జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల్లో అవినీతికి తావు లేకుండా అందరికీ అందుతాయని అభిప్రాయపడ్డారు. పారదర్శక, అవినీతిరహిత పాలన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఐఐఎం ప్రతినిధులకు వివరించారు సీఎం జగన్.