ఏపీ రాజకీయాల్లో బిగ్ డెవలప్ మెంట్. ఎన్నికల టైం కావటంతో పార్టీల్లోకి వలసలు జోరుగా ఉన్నాయి. అటూ ఇటూ మారేవారితో ఆయా పార్టీ ఆఫీసులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేతలు క్యూ పెట్టారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ఓ ఎమ్మెల్యే రాగా.. ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కూడా జగన్ పార్టీకి జై కొట్టారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయ్యారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఉన్న కొద్దోగొప్పో నేతలు కూడా ఇప్పుడు చంద్రబాబు, జగన్ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ కు కల్లి కృపారాణి దంపతులు గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులకు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహన్ రావు రాజీనామా చేశారు. రాహుల్ గాంధీకి రాజీనామా లేఖలు మెయిల్ చేశారు. 2019, ఫిబ్రవరి 28వ తేదీన అధికారికంగా జగన్ పార్టీలో చేరుతున్నారు కిల్లి కృపారాణి.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కృపారాణి.. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున వరసగా 2004, 2009, 2014లో ఆమె పోటీ చేశారు. 2009లో ఒక్కసారి మాత్రమే ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆమె.. కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రిగా పని చేశారు. జిల్లాలో కీలక నేతగా ఉన్నారు.