రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఏపీ పాలిటిక్స్‌లో ఈ సామెత మరోసారి నిజమైంది. ఒకప్పటి మిత్రులు గంటా, అవంతి మధ్య… ఇప్పుడు పచ్చగడ్డి
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఏపీ పాలిటిక్స్‌లో ఈ సామెత మరోసారి నిజమైంది. ఒకప్పటి మిత్రులు గంటా, అవంతి మధ్య… ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో ప్రాణ స్నేహితులుగా మెలిగిన నేతలిద్దరూ… ప్రస్తుతం బద్ధ శత్రువులుగా మారిపోయారు. అసలు.. వీరిద్దరి ఫ్రెండ్‌షిప్‌కు గుడ్‌బై చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.
అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు.. ఉత్తరాంధ్రలో మంచి పట్టున్న నేతలు. ఇద్దరూ మంచి మిత్రులు. అంతకుమించి గురు శిష్యులు. విద్యా సంస్థలను చూసుకుంటున్న అవంతి శ్రీనివాసరావును ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి పోటీ చేయించింది గంటా శ్రీనివాసరావే. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం అనంతరం.. అవంతి, గంటా ఇద్దరూ టీడీపీ తీర్ధం తీసుకున్నారు. గురువు గంటా శ్రీనివాసరావు కోసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిని వదిలి.. అనకాపల్లి ఎంపీగా అవంతి శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా అవంతికి మొదటి నుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని కోరిక బలంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో 2014లో పార్లమెంట్‌కు వెళ్లారు. 2019లో అవంతి భీమిలి నుంచి తిరిగి పోటీ చేయాలని భావించడంతో గొడవ మొదలైంది. భీమిలిని వదులుకునేందుకు గంటా సిద్ధంగా లేకపోవడంతో… అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరి పోటీ చేసి గెలిచారు. గంటా కూడా భీమిలిని వదిలేసి విశాఖ నార్త్ నుంచి పోటీకి దిగి గెలుపొందారు. గంటా శ్రీనివాసరావు మంత్రి కావడానికి పుష్కర కాలం వెయిట్ చేస్తే… అవంతి మాత్రం గురువు బాటలోనే పదేళ్లు తిరక్కుండానే మంత్రి పదవి దక్కించుకున్నారు.
మరోవైపు త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న పార్టీలు… స్థానికంగా బలమైన నేతల్ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో 22 ఏళ్లుగా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన అడారి కుటుంబం… అధికార పార్టీ గూటికి చేరింది. అడారి కుటుంబం వైసీపీలో చేరడం వెనుక మంత్రి అవంతి శ్రీనివాస్ చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు కూడా త్వరలోనే వైసీపీలో చేరతాని వార్తలు వినిపిస్తున్నప్పటికీ… ఆయన రాకను మాజీ స్నేహితుడు అవంతి వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు పదును పెట్టారు. పోటీ పడి మరీ తిట్లు కురిపించుకుంటున్నారు.
గంటా శ్రీనివాస్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి చేసిన భూ కబ్జాలు, అరాచకాలపై గంటా సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతాడని…రాజకీయాల్లోకి తీసుకొచ్చిన అయ్యన్నపాత్రుడుకు గంటా అదే చేశాడని విమర్శించారు. తనను మంత్రికాదన్న గంటాను కనీసం మనిషిగా కూడా గుర్తించబోనని అన్నారు. చంద్రబాబులా గంటా కూడా ఇప్పటికీ మంత్రిననే భ్రమలో ఉన్నాడని ఎద్దేవా చేశారు అవంతి. తాను నోరు తెరిస్తే గంటా బండారమంతా బయటపడుతుందని అవంతి హెచ్చరించారు. విజయనగరం జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉండి ఏమీ సాధించలేకపోయాడని ఎద్దేవా చేశారు. నమ్ముకున్న వారికి సీట్లు ఇప్పిస్తానని గంటా పంగనామాలు పెట్టారని అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.
పార్టీకి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చే ఎవర్నైనా సీఎం జగన్ పార్టీలో చేర్చుకుంటారన్న అవంతి.. కన్నింగ్‌లను, కబ్జాదారులను మాత్రం వైసీపీలో చేర్చుకోరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో.. మంత్రి కామెంట్లు కలకలం రేపుతున్నాయి. మొత్తానికి భీమిలి అసెంబ్లీ సీటు దగ్గర మొదలైన రగడ… గంటా, అవంతి మధ్య చిచ్చు పెట్టింది. ప్రాణ స్నేహితులుగా మెలిగిన వారిని… బద్ధ శత్రువులుగా మార్చేసింది. ఒకరి పేరు ఒకరు వినడానికి కూడా ఇష్టపడనంత వైరం పెరిగింది. మరి.. వీరిద్దరి శత్రుత్వానికి… ఎప్పుడు.. ఎలా బ్రేక్ పడుతుందో చూడాలి.