Mla Thomas: కాంట్రవర్సీకి కేరాఫ్‌గా టీడీపీ ఎమ్మెల్యే థామస్.. సొంత పార్టీ నేతలు, అధిష్టానం సీరియస్.. ఎందుకు?
తన మాటలను వక్రీకరించారని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విప్‌గాను కొనసాగుతున్న ఎమ్మెల్యే థామస్‌ను పార్టీ గట్టిగానే మందలించినట్లు చర్చించుకుంటున్నారు.
- Naveen
- Updated on- June 1, 2026 / 10:56 PM IST
- కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఎమ్మెల్యే థామస్
- ఎస్సీ ఎమ్మెల్యేలకు గౌరవం లభించట్లేదని కామెంట్స్
- లేటెస్ట్‌గా అగ్రవర్ణ ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే థామస్ తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్
- థామస్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేల గుస్సా
Mla Thomas: నోరు జారి, మళ్లీ నాలుక కరుచుకున్నారు ఆ టీడీపీ ఎమ్మెల్యే. సొంత పార్టీకి చెందిన సహచర ఎమ్మెల్యేలపైనే ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఆయనతో పాటు వేదిక పంచుకున్న ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వ్యవహారం కాస్త పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో ఆ ఎమ్మెల్యే చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ఆ ఎమ్మెల్యే తీరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా సీరియస్‌గానే ఉన్నారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రూటే సపరేటు. డాక్టర్ వృత్తిలో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేసి న్యూస్ హెడ్‌లైన్‌గా మారుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడం లేదంటూ గతంలో ఆయన చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. ఇదే విషయంపై పలుమార్లు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు కూడా. లేటెస్ట్‌గా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే థామస్.
అగ్రవర్ణ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏం జరిగినా వార్తలు రావు..
మీడియా సమావేశం సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..సొంత ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మట్టి అక్రమ రవాణతో సహా ఏ చిన్న ఘటన జరిగినా మీడియాలో హైలెట్ చేస్తారని..అదే అగ్రవర్ణ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏం జరిగినా వాటిపై మీడియాలో కథనాలు రావడం లేదంటూ థామస్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్‌గా మారాయి. అంతటితో ఆగకుండా ఆయన..పక్కనే ఉన్న చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి మట్టి అక్రమంగా బయటకు వెళ్లడం లేదా? వాటిని ఎందుకు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ..మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ మాటలు వైరల్ అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు స్వతహాగానే చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాశ్‌లకు ఆగ్రహం తెప్పించినా..సొంత పార్టీ సహచర ఎమ్మెల్యే కావడంతో కౌంటర్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. చివరకు థామస్ కామెంట్స్ పార్టీ అధిష్టానం చెవిన పడటంతో పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాస్, థామస్‌ను సంజాయిషీ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో పల్లా శ్రీనివాస్ ను కలిసి తాను చేసిన వ్యాఖ్యలపై థామస్ వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విప్‌గాను కొనసాగుతున్న ఎమ్మెల్యే థామస్‌ను పార్టీ గట్టిగానే మందలించినట్లు చర్చించుకుంటున్నారు.
అయితే జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం థామస్ తీరుపై కొంతకాలంగా గుర్రుగానే ఉన్నారట. ఎస్సీ ఎమ్మెల్యేలు, అగ్రవర్ణ ఎమ్మెల్యేలు అంటూ జిల్లాలో ఎమ్మెల్యేలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారట. తనపై ఆరోపణలు వస్తే వాటిని ఖండించాల్సింది పోయి..పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలకు బురద అంటించడం ఏంటని జిల్లా ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారట. గతంలోనూ ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారని కూడా కొందరు ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. మరోసారి థామస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని ఒకరిద్దరు జిల్లా ఎమ్మెల్యేలు డిసైడ్ అయినట్లు టాక్.
Also Read: ఏపీలో లోకల్ వార్..! కూటమి పార్టీల ప్లానింగ్స్ ఏంటి? ఏకగ్రీవాలకు వైసీపీ చెక్ పెట్టగలదా?
