Telangana Government: కొత్త విప్‌ల నియామకం.. అసలు హస్తం పార్టీ వ్యూహం ఏంటి? వారికి ప్రమోషన్ దక్కబోతోందా?

ఏప్రిల్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణతో పాటు రీషప్లింగ్ ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆశావహులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా పదవులను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Published On : March 20, 2026 / 09:24 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం..
  • ఇద్దరు పాత విప్‌లలో ప్రమోషన్ ఎవరికి?
  • గతంలో విప్‌గా పనిచేసిన అడ్లూరికి మంత్రిగా ప్రమోషన్
  • మంత్రి రేసులో విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య..!

 

Telangana Government: అటు క్యాబినెట్ బెర్తులు..ఇటు నామినేటెడ్ పోస్టులు. ఇక ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసే ప్లాన్ చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా అసెంబ్లీ సెషన్ జరుగుతున్న వేళ..ఆల్ ఆఫ్ సడెన్‌గా కొత్త విప్‌లను నియమించింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు విప్‌లుగా అవకాశం కల్పించింది. కొత్త విప్‌ల నియామకం వెనుక హస్తం పార్టీ వ్యూహం ఏంటి? కొత్త వారి రాకతో.. పాత వారికి ప్రమోషన్ దక్కబోతోందా?

ఇప్పటికే రెండున్నరేళ్ల పాలన పూర్తి కావొస్తోంది. ఎన్నికలకు ఇంకో రెండున్నరేళ్లే ఉన్నట్లు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆశావహులు పదవుల కోసం కాంగ్రెస్ పెద్దలపై ప్రెజర్ పెడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు బెర్తులతో మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టులు, విప్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బడ్జెట్ సెషన్ వేళ అసెంబ్లీ, శాసన మండలిలో విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అసెంబ్లీలో కొత్తగా ముగ్గురు విప్‌లకు అవకాశం కల్పించారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్‌ను విప్‌లుగా నియమించారు. శాసనమండలిలో విప్‌లు లేకపోవడంతో అద్దంకి, బల్మూర్ వెంకట్‌కు అవకాశం దక్కినప్పటికీ..శాసనసభలో మాత్రం ఆల్రెడీ ముగ్గురు విప్‌లు ఉండగా..ఆల్ ఆఫ్ సడెన్‌గా మరో ముగ్గురిని విప్‌లుగా నియమించడంపై సరికొత్త చర్చ జరుగుతోంది.

గతంలో ఇద్దరు విప్‌లకు ప్రమోషన్..

గతంలో విప్‌లుగా నలుగురికి అవకాశం ఇచ్చారు. అందులో ఇద్దరు విప్‌లకు ప్రమోషన్ లభించింది. మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం దక్కగా..రామచంద్రు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించారు. కానీ ఇంకా రామచంద్రు నాయక్ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు తీసుకోలేదు. ప్రస్తుతం ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య విప్‌లుగా ఉండగా..కొత్తగా ముగ్గురికి అవకాశం ఇచ్చారు.

ప్రభుత్వంపై జరిగే దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టేలా..

కొత్తగా ఒకేసారి ముగ్గురికి విప్‌లుగా అవకాశం ఇవ్వడం వెనుక..ప్రభుత్వ పెద్దల ఆలోచన మరొకటి ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి కావస్తోంది. ఇక మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. ఇక మును ముందు రానున్న కాలం ప్రభుత్వానికి అత్యంత కీలకం అని చెప్పొచ్చు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు వాయిస్ మరింత పెంచే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం ఖాయం. దీంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై జరిగే దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలనే ఆలోచనతో విప్‌ల సంఖ్య పెంచారనే టాక్ వినిపిస్తుంది.

ఇక విప్‌లుగా పనిచేస్తున్న వారికి కూడా ప్రమోషన్ లభించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. గతంలో ఇద్దరికి ప్రమోషన్ దక్కగా..మరో ఇద్దరు కూడా ప్రమోషన్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలలో భాగంగా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వాలని ఆది శ్రీనివాస్ చాలా కాలం నుంచి కోరుతున్నారు. తెలంగాణలో..ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మున్నూరు కాపు బలమైన సామాజిక వర్గం కావడంతో..తమ వర్గానికి క్యాబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని..ఆ వర్గం నేతలు కూడా పార్టీ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు. అలాగే బీర్ల అయిలయ్య కూడా యాదవ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

ఎవరు ఇన్, ఎవరు ఔట్?

ఏప్రిల్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణతో పాటు రీషప్లింగ్ ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆశావహులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా పదవులను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విప్‌లలో కనీసం ఒకరికి క్యాబినెట్ బెర్త్‌ పక్కా అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇద్దరు ముగ్గురు మంత్రుల బెర్తులకు కూడా ఎసరు తప్పదనే టాక్ నడుస్తోంది. క్యాబినెట్ ప్రక్షాళన జరిగితే ఛాన్స్ దక్కేదెవరి? ఉన్న పోస్ట్ ఊడేదెవరిదో చూడాలి.

Also Read: తెలంగాణలో జూన్ 2 నుంచి కొత్త పథకం.. కుటుంబానికి రూ.5లక్షలు.. ఈ పథకం వల్ల ఉపయోగాలు ఇవే..