Harsh Vardhan Bidhuri Remarks: డానిష్ అలీపై బీజేపీ ఎంపీ చేసిన అవమానకర వ్యాఖ్యలపై నవ్వారంటూ ట్రోల్స్.. సుదీర్ఘ లేఖ రాసిన కేంద్ర మాజీమంత్రి హర్షవర్ధన్

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌పై గురువారం రాత్రి లోక్‌సభలో చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి మాట్లాడుతూ బీఎస్పీ లోక్‌సభ సభ్యుడు కున్వర్ డానిష్ అలీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు

Bidhuri Remarks on Dnish Ali: లోక్‌సభలో బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అవమానకర వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై ఇప్పటికే బధూరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ సమయంలో లోక్‌సభలో కూర్చొని నవ్వుతున్న కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ మీద కూడా ట్రోల్ వస్తున్నాయి. అయితే తనపై వస్తున్న ట్రోల్స్ మీద హర్షవర్ధన్ క్లారిటీ ఇచ్చారు. ఈ దురదృష్టకర సంఘటనలోకి తనను అనవసరంగా లాగారని మాజీ మంత్రి అన్నారు.

‘‘స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, కొందరు అనవసరంగా నా పేరును ఈ విషయంలోకి లాగారు. ఈ సంఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోవడానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అయినప్పటికీ (అసలు సభ మొత్తం ఇదే) నిజం ఏమిటంటే ఆ సందడిలో నాకు ఏమీ స్పష్టంగా కనిపించలేదు. అర్థం కాలేదు’’ అని తన ఎక్స్ ఖాతాలో ఆయన రాసుకొచ్చారు.

డానిష్ అలీపై బీజేపీ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్య
చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌పై గురువారం రాత్రి లోక్‌సభలో చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి మాట్లాడుతూ బీఎస్పీ లోక్‌సభ సభ్యుడు కున్వర్ డానిష్ అలీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హర్షవర్ధన్ సింగ్ ట్రోల్స్ లో ఇరుక్కున్నారు. వీడియో క్లిప్‌లో, బీజేపీ ఎంపీ బిధురి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వినవచ్చు. అలాగే ఆయన వెనుక కూర్చున్న ఎంపీ హర్షవర్ధన్ సింగ్ నవ్వుతూ కనిపించారు.

సోషల్ మీడియాలో ట్రోల్ కావడంపై క్లారిటీ
రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లోక్‌సభలో కూర్చున్నప్పుడు చేసిన ప్రకటనకు నవ్విన డాక్టర్ హర్షవర్ధన్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. ప్రతిష్టాత్మకమైన చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని, అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు ఇవ్వకపోతే ఇది ఎప్పటికీ సాధ్యం అయ్యేది కాదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అనవసరంగా తన పేరును ఈ విషయంలోకి లాగారని ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని హర్షవర్ధన్ అన్నారు.