Intresting comments by Tharoor on Cong President Poll
Cong President Poll: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు ఎలాగైనా గెలవాలనే కసితో ప్రచారం చేసిన ఆయన.. తాజాగా తన ఓటమిని అంగీకరించినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ ఎన్నికను ఉద్దేశించి అధికారిక అభ్యర్థి, ఓడిపోయే అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోందని, ఈ విషయం తనకు కూడా తెలుసని అన్నారాయన. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించకపోవడం, పెద్దగా వ్యాఖ్యానించకపోవడంతో ఈ ఎన్నికలో ఓటమిని థరూర్ ముందుగానే ఊహించారని అంటున్నారు.
అయితే ఈ ఎన్నికలో గాంధీ కుటుంబం తటస్థంగా, నిష్పాక్షికంగా ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమానార్హం. ఎందుకంటే, మల్లికార్జున ఖర్గేని గాంధీ కుటుంబమే ముందుకు తీసుకు వచ్చిందనే బహిరంగ రహస్యం ఆయనకి తెలియంది కాదు. ఇకపోతే, ఎప్పటిలాగే తాను మార్పును కోరుకుంటున్నానని, మార్పుకు రాయబారిగా ఉంటానని థరూర్ అన్నారు.
‘‘కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఒకరు అధికారిక అభ్యర్థి అని, తాను బలమైన అభ్యర్థిని కానని కొందరు చెప్తున్నట్లు నాకు తెలుసు. నేను, మల్లికార్జున ఖర్గే స్నేహితులం. తాము పని చేసే తీరు మాత్రమే విభిన్నమైంది. నేను మార్పునకు రాయబారిగా ఉండాలనుకుంటున్నాను. ఫలానా వ్యక్తికి ఓటు వేయాలని ప్రతినిధులను ఎవరో కోరారని ఎవరైనా చెప్పారంటే, అది నిజం కాదు’’ అని థరూర్ అన్నారు.