BJP MP Ramesh Jigajinagi: దళితులైతే అంతే, అస్సలు ఎదగలేరు.. సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

ధనిక నేతలు లేదంటే గౌడ (వొక్కలిగ) నాయకులు అయితే ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. కానీ ఇక్కడ దళితుల పరిస్థితి అలా కాదు. ఎవరూ మద్దతు ఇవ్వరు. దురదృష్టకరమైన ఈ వాస్తవం మాకు కూడా తెలుసు

Karnataka Politics: కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను నియమించడం పట్ల సొంత పార్టీలో నిప్పు అంటుకుంది. పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, వారిని కాదని విజయేంద్రకు అధ్యక్ష పదవి ఇవ్వడమేంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ రమేశ్ జగజినగి అయితే మరో అడుగు ముందుకు వేసి కులం ఆధారంగా అవకాశాలు ఉంటాయని తేల్చేశారు.

దళితులైతే పార్టీలో ఎదుగుదల ఉండదని, విజయేంద్రకు పార్టీ అధ్యక్ష పదవి రావడానికి కారణం ఆయన తండ్రి యడియూరప్పని ఆయన అన్నారు. ‘‘ఒకవేళ మీరు దళితులు అయితే బీజేపీలో ఎదిగేందుకు ఎలాంటి అవకాశం ఉండదు’’ అని అన్నారు. ‘‘ధనిక నేతలు లేదంటే గౌడ (వొక్కలిగ) నాయకులు అయితే ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. కానీ ఇక్కడ దళితుల పరిస్థితి అలా కాదు. ఎవరూ మద్దతు ఇవ్వరు. దురదృష్టకరమైన ఈ వాస్తవం మాకు కూడా తెలుసు’’ అని అన్నారు.

విజయేంద్రను పార్టీ చీఫ్ గా నియమించడం పట్ల బీజేపీ హైకమాండ్ మీద రమేశ్ జగజినగి విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో అవకాశాలు కొందరికే పరిమితం చేయకూడదని అన్నారు. ఇప్పటికే పలుమార్లు పదవులు అనుభవించిన యడియూరప్ప కుమారుడికి అధ్యక్ష పదవి ఇవ్వడం మిగతా నాయకులను అవమానించడమేనని అన్నారు. ఇకపోతే.. నలిన్ కుమార్ కటీల్ స్థానంలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్రను నియమిస్తూ జేపీ నడ్డా నవంబర్ 10వ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 15న అధికారికంగా విజయేంద్ర బాధ్యతలు తీసుకోనున్నారు.