అకాల వర్షాలతోనే ఉల్లి సమస్య వచ్చిందని మంత్రి పార్థసారధి అన్నారు. ధర తగ్గే వరకు రూ.25లకే కిలో ఉల్లిపాయలు అందిస్తామని చెప్పారు.
అకాల వర్షాలతోనే ఉల్లి సమస్య వచ్చిందని మంత్రి పార్థసారధి అన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు పడ్డాయన్నారు. ధర తగ్గే వరకు రూ.25లకే కిలో ఉల్లిపాయలు అందిస్తామని చెప్పారు. మంగళవారం(డిసెంబర్ 10, 2019) ఉల్లి ధరలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సమస్యను ముందే ఊహించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతుల నుంచి నేరుగా ఉల్లిపాయలను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
ఏపీలో మాత్రమే తక్కువ ధరకు ఉల్లిపాయలు అందిస్తున్నామని చెప్పారు. 39 వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి కేజీకి రూ.25లకే ప్రజలకు అందించామని తెలిపారు. వరి, మిర్చి, మినుములకు తాము మద్దతు ధరలు ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పాలనలో రైతులకు మద్దతు ధరలు ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం రైతుల భాగోగులు మర్చిపోయిందన్నారు.
అంతకముందు మంత్రి మోపిదేవి వెంకటరమణ సెప్టెంబర్ నుంచి ఉల్లి ధర పెరుగుతోందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిన్నదన్నారు. అధిక వర్షాలతో ఉల్లి పంటకు నష్టం కలిగిందన్నారు. ఉల్లి కొరతతోనే ధర పెరిగిందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు బజార్లలో రూ.25లకే కిలో ఉల్లి అందిస్తున్నామని చెప్పారు. డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో దేశ వ్యాప్తంగా ఉల్లి ధర పెరిగిందన్నారు. ధరలు అదుపులోకి వచ్చే వరకు రూ.25లకే అందిస్తామని చెప్పారు.