శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి బుధవారం చివరిరోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. పాదయాత్ర చివరి రోజు కావటంతో వేలాదిగా ఆయన అభిమానులు తరలివచ్చి పాదయాత్రలో పాల్గోంటున్నారు. చివరిరోజు పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు వైఎస్ జగన్ వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇఛ్చాపురం లో నిర్వహించే విజయ సంకల్పయాత్ర బహిరంగసభతో పాదయాత్ర ముగుస్తుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇఛ్చాపురంలో జాతీయ రహాదారి సమీపంలో భారీ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. బహిరంగసభను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలనుంచి వేలాదిగా అభిమానులు,ప్రజలు పెద్ద ఎత్తున ఇఛ్చాపురం తరలి వస్తున్నారు. 2017 నవంబర్ 6న కడపజిల్లా ఇడుపులపాయలోనివైఎస్సార్ ఘాట్ లో ప్రారంభమైన పాదయాత్ర 341 రోజులు సుదీర్ఘకాలం సాగి నేటితో ఇఛ్చాపురంలో ముగుస్తుంది. తన పర్యటన కాలంలో ఆయన 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లమేర నడక సాగించారు.