తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఎవరి భిక్ష కాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఎవరి భిక్ష కాదన్నారు. అధికారం శాశ్వతం కాదు..ధర్మం, న్యాయమే శాశ్వతమన్నారు ఈటెల. చిల్లర ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మొదటి నుంచీ ఉద్యమంలో ఉన్నానని.. మధ్యలో వచ్చిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తాము గులాబీ జెండా ఓనర్లమన్నారు. అడుక్కునే వాళ్లం కాదని ఆవేశంగా మాట్లాడారు మంత్రి ఈటెల. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు కాదన్నారు.
తాను అవినీతికి పాల్పడినట్లు ఒక్కరు నిరూపించినా… రాజకీయాలను నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తనను ఓడించాలని దొంగల గుంపు తయారై మీటింగ్ లు పెట్టుకుని రక రకాల ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ విముక్తి కోసం కోట్లాడినట్లు గుర్తు చేశారు. న్యాయం, ధర్మం నుంచి తప్పించుకోలేరని.. ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
చాలా రోజుల తర్వాత ఈటెల రాజేందర్ ఆవేశపూరితంగా వ్యాఖ్యాలు చేశారు. మనోవేదనతో మాట్లాడారు. ఇటీవల సోషల్ మీడియాలో ఈటెల రాజేందర్ పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. దానికి సమాధానంగానే ఈటెల సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లుగా చెప్పవచ్చు.
సోషల్ మీడియా మొత్తం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టింది. అది కూడా హుజూరాబాద్ నుంచి ఎక్కువగా ఈ ప్రచారం కావడంతో అక్కడి నుంచే సమాధానం చెప్పాలని నిర్ణయించుకుని ఈటెల ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా స్పష్టమవుతోంది. తనపై చిల్లర ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను తప్పితే ఎవరికి కూడా అన్యాయం చేయనని చెప్పారు. మొత్తంగా ఈటెల వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.