జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. ఉల్లి నిత్యావసర సరుకుల్లో భాగం కాదని కన్నబాబు అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. ఉల్లి నిత్యావసర సరుకుల్లో భాగం కాదని కన్నబాబు అన్నారు. గురువారం (డిసెంబర్ 12, 2019) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బియ్యం, గోధుమ, మంచినూనె లాంటివి నిత్యావసరాల జాబితాలో ఉన్నాయన్నారు.
2014లో కేంద్రం పరిమితి కాలానికి ఉల్లిని నిత్యావరసరాల సరుకుల జాబితాలో చేర్చిందన్నారు. ఉల్లి నిత్యావసర జాబితాలో ఉందో లేదో తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఉల్లిధరలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉల్లి ధరలు రూ.200పైగా పెరిగాయి.
దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ కింద పంపిణీ చేస్తున్న ఉల్లిపాయల కోసం జనం ఎగబెడుతున్నారు. భారీగా క్యూలో నిల్చుంటున్నారు. ఇటీవల గుడివాడలో ఉల్లిపాయల కోసం రైతు బజారులో క్యూలో నిల్చుని వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన ఏపీలో సంచలనం కలిగించింది. అసెంబ్లీలో సమావేశాల్లో కూడా ఉల్లి ధరలపై చర్చ సాగింది. అకాల వర్షాలతోనే ఉల్లి సమస్య వచ్చిందని మంత్రి పార్థసారధి అన్నారు.
పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు పడ్డాయన్నారు. ధర తగ్గే వరకు రూ.25లకే కిలో ఉల్లిపాయలు అందిస్తామని చెప్పారు. మంగళవారం(డిసెంబర్ 10, 2019) ఉల్లి ధరలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సమస్యను ముందే ఊహించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతుల నుంచి నేరుగా ఉల్లిపాయలను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
ఏపీలో మాత్రమే తక్కువ ధరకు ఉల్లిపాయలు అందిస్తున్నామని చెప్పారు. 39 వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందించామని తెలిపారు. వరి, మిర్చి, మినుములకు తాము మద్దతు ధరలు ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పాలనలో రైతులకు మద్దతు ధరలు ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం రైతుల భాగోగులు మర్చిపోయిందన్నారు.