టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. రాజధానిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. రాజధానిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం (జనవరి 4, 2020) 10 టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి రైతులకు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. 29 గ్రామాలు తమకు చాలన్నట్లుగా చంద్రబాబు, పవన్ తీరుందన్నారు. రాజధాని తరలిపోతుందని ప్రజలను కొందరు రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు.
రాజధాని తరలింపు కాదని.. అభివృద్ధి వికేంద్రీకరణ అని తెలిపారు. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు ప్రలోభ పెట్టారని విమర్శించారు. లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధానిని నిర్మించకుండా ఒక నగరాన్ని నిర్మించే ప్రయత్నం చేశారని తెలిపారు. అమరావతి తన సృష్టేనంటూ గొప్పులు చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని చెప్పారు. రూ.5వేల కోట్లను ఒకే చోట వెచ్చించే బదులు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఖర్చు పెట్టి.. రెండింటినీ అనుసంధానం చేసుంటే అభివృద్ధి జరిగేదని పేర్కొన్నారు.
రాజధాని అంశాన్ని జగన్ ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంటారని అన్నారు. జగన్ పుట్టింది కడపలో అయితే… వైజాగ్ గురించి ఎందుకు ఆలోచిస్తారని పేర్కొన్నారు. రైతులకు నష్టం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జగన్ పని చేస్తున్నారని తెలిపారు. అమరావతిలో అసెంబ్లీ, ఉత్తరాంధ్రలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. జనవరి 6వ తేదీ రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.
కమిటీలు సూచనలు చేసినంత మాత్రాన హడావుడి నిర్ణయాలుండవని తెలిపారు. రైతులతోపాటు అన్ని కమిటీలతో చర్చించాక రాజధాని అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పునాదులు వేయడానికి జీఎన్ రావు, బీసీజీ కమిటీలు మంచి నివేదికలు ఇచ్చాయని తెలిపారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నదే వైసీపీ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. అమరాతి రైతులు ఆందోళన చెందొద్దని..న్యాయం చేస్తామని చెప్పారు.