Bandi Sanjay: మేము ఓట్ల చోరీ చేస్తే.. తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా? మీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా?- బండి సంజయ్ ఫైర్

పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.(Bandi Sanjay)

Bandi Sanjay: మేము ఓట్ల చోరీ చేస్తే.. తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా? మీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా?- బండి సంజయ్ ఫైర్

Updated On : August 15, 2025 / 8:08 PM IST

Bandi Sanjay: ఎలక్షన్​ కమిషన్​ ఓట్ల చోరీకి పాల్పడింది అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ, ప్రధాని మోదీ, ఈసీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు.

ఓట్ల చోరీకి, బీజేపీకి ఏం సంబంధం? అని రాహుల్ గాంధీపై మండిపడ్డారు. మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా? ఇండీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా? కేంద్రంలో బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? అంటూ రాహుల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తిరంగా ర్యాలీని ప్రారంభించారు బండి సంజయ్.

మార్వాడీ గో బ్యాక్.. హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర..!

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే.. మేము హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తామన్నారు. రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తామన్నారు. మార్వాడీ గో బ్యాక్.. హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర అని బండి సంజయ్ ఆరోపించారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివి అని మండిపడ్డారు. (Bandi Sanjay)

పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రై క్లీన్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపరు? అని నిలదీశారు.

”మార్వాడీలు గో బ్యాక్ అనేది కొంతమంది కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతలు కలిసి ఆడుతున్న నాటకం. గుజరాతీలు, మార్వాడీలు సంపద దోచుకునేందుకు రాలేదు. వారు వ్యాపారాలు చేసుకుని రాష్ట్ర సంపదను పెంచేందుకు వస్తున్నారు. దమ్ముంటే నగరంలో ఆక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల గురించి మాట్లాడాలి. వాళ్ళ వల్ల బాంబు పేలుళ్ళు జరుగుతున్నాయి. మైనారిటీలు అన్ని వృత్తుల్లో బీసీల పొట్ట కొడుతున్నారు.

మార్వాడీలు ఎవరి ఉత్పత్తులు దోచుకోవడం లేదు. ఇది ఒక కుట్ర.. హిందూ సమాజం జాగృతం అవుతుంది. రోహింగ్యాలు గో బ్యాక్ అని మేం అంటాం. ఈసీకి, బీజేపీకి, మోదీకి ఏం సంబంధం? ఫిర్యాదు వస్తే ఈసీ చర్యలు తీసుకుంటుంది. మేం ఈసీని మ్యానేజ్ చేసేలా ఉంటే 240 ఎంపీ సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం? ఓల్డ్ సిటీలో ఒక్క ఇంట్లో 300 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్లు 60ఏళ్ళు దేశాన్ని దోచుకున్నారు. మీరు రిగ్గింగ్ చేశారని మేము అన్నామా? (Bandi Sanjay)

బీహార్ లో మీ పార్టీని నమ్మరు. అక్కడ గెలిచేది మేమే. కాంగ్రెస్ మూర్ఖత్వంతో జెండాలను ఎగురవేయనీయలేదు. మోదీ వచ్చాక ప్రతి ఒక్కరూ జెండా ఎగురవేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం మోదీ ఆలోచన. మోదీ పాలనకు ముందు పరిస్థితి ఏంటి? అంతకుముందు పాలన ఏంటో ప్రజలు చూస్తున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. రెండు రాజ్యాంగాలు అవసరం లేదని పోరాటం చేసిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ” అని బండి సంజయ్ అన్నారు.

Also Read: కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కవిత.. చిన్న కుమారుడితో కలిసి తండ్రి వద్దకు.. ఇవాళ రాత్రి అమెరికాకు పయనం..