Mlc Kavitha: కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కవిత.. చిన్న కుమారుడితో కలిసి తండ్రి వద్దకు.. ఇవాళ రాత్రి అమెరికాకు పయనం..
కొంతకాలంగా కేసీఆర్ కుటుంబానికి, పార్టీకి దూరంగా ఉంటున్నారు కవిత. ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. కవిత చేసిన.. (Mlc Kavitha)

Mlc Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్యకు కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించేందుకు కవిత ఎర్రవల్లికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇవాళ అర్థరాత్రి కవిత తన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా వెళ్లబోతున్నారు. తన చిన్న కుమారుడిని ఓ యూనివర్సిటీలో జాయిన్ చేయబోతున్నారు. ఇందుకోసం తన తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు.
కవిత చిన్న కుమారుడు అమెరికాలో విద్యను అభ్యసించబోతున్నాడు. అమెరికాకు వెళ్లే ముందు తాత కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు. తన కుటుంబసభ్యులతో కలిసి కవిత ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ కు కవిత రాసిన లేక లీక్ తర్వాత ఎంత దుమారం రేగిందో తెలిసిందే. లెటర్ లీక్ కు సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో దుమారం రేపాయి. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి.
కవితను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ దూరం పెడుతూ వస్తున్నాయి. కవిత వ్యాఖ్యలు, కేసీఆర్ వైఖరిని తప్పుపట్టడం, కేటీఆర్ హరీశ్ రావు, ఇతర పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కవిత చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. కొంతకాలంగా కేసీఆర్ కుటుంబానికి, పార్టీకి దూరంగా ఉంటున్నారు కవిత. ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది.
ఇలాంటి సమయంలో కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కవితతో మాట్లాడతారా? లేక మనవడికి ఆశీర్వాదం ఇచ్చి పంపేస్తారా? అన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే గత రెండు మూడు సందర్భాల్లో కవితతో కేసీఆర్ పెద్దగా మాట్లాడింది లేదు. ముభావంగానే ఉన్నారు. కవితను కేసీఆర్ దూరం పెట్టారనే చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. చాలా రోజుల తర్వాత కవిత తన తండ్రిని కలవడానికి వెళ్లారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితతో కేసీఆర్ మనసు విప్పి మాట్లాడతారా? లేక ఆశీర్వాదం వరకే పరిమితం అవుతారా? అన్న ఉత్కంఠ నెలకొంది. (Mlc Kavitha)
కేసీఆర్ ఫామ్ హౌస్ కి సరిగ్గా కవిత వెళ్లే సమయానికే కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్ బీఆర్ఎస్ చీఫ్ తో భేటీ కావాల్సి ఉంది. అయితే వారు ఇంకా ఫామ్ హౌస్ కి చేరుకోలేదు. వారి కన్నా ముందే కవిత ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ తో కవిత భేటీ తర్వాతే వారంతా ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ రాత్రి అమెరికా వెళ్లనున్న కవిత.. 15 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.