TJS Leaders: కోదండరాం సార్.. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటా..! కాంగ్రెస్‌ తీరుపై గుర్రుగా టీజేఎస్ నేతలు? భవిష్యత్ ప్రణాళిక ఏంటి?

2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా కాంగ్రెస్‌కు ఔట్‌రైట్‌ సపోర్ట్ చేశారు. అధికారంలోకి వ‌స్తే.. (TJS Leaders)

TJS Leaders: కోదండరాం సార్.. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటా..! కాంగ్రెస్‌ తీరుపై గుర్రుగా టీజేఎస్ నేతలు? భవిష్యత్ ప్రణాళిక ఏంటి?

Updated On : August 15, 2025 / 12:48 AM IST

TJS Leaders: ప్రొఫెసర్ గారు పెట్టిన పార్టీ. జేఏసీ ఛైర్మన్‌గా ఎంతో పేరున్న ఆయన..పార్టీ పెట్టడం ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతివ్వడం మరో ఎత్తు. సరే కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా చేసినా..తమకు దక్కిందేమి లేదని గుర్రుగా ఉన్నారట జనసమితి నేతలు. తమ అధినేతకు ఇచ్చిన పోస్ట్ కూడా ఊస్ట్‌ అయ్యేలా చేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో కోదండరాం సార్ ఏదో అనుకుంటే ఏదో అయిందన్న చందంగా మారిందట పరిస్థితి. కాంగ్రెస్ తీరుపై తెలంగాణ జనసమితి వాయిస్ ఏంటి?

అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన..!

తెలంగాణ జ‌న స‌మితి పార్టీ నేత‌లు అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నార‌ట‌. కాంగ్రెస్‌కు అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నా..ఎన్నికల్లో గెలిచేందుకు అండగా నిలిచినా తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా భేష‌ర‌తుగా మ‌ద్దతిస్తే.. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతున్నా తమను ప‌ట్టించుకోవ‌డం లేద‌ంటున్నారట.

హామీ ఇచ్చినట్లు నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వడం పక్కన పెడితే..తమ అధ్యక్షుడు కోదండ‌రాంకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా కోర్టు తీర్పుతో ఊడిపోయిందని గుస్సా మీదున్నారట. ఏదో అనుకుంటే.. మ‌రేదో అయిన చందంగా మారింద‌ట‌.

 

తెలంగాణ స‌మాజంలో ప్రొఫెస‌ర్ కోదండ‌రాం అంటే ప్రత్యేక గుర్తింపు. ఉద్యమ స‌మ‌యంలో పొలిటిక‌ల్ జేఏసీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు అన్ని రాజ‌కీయ‌ పార్టీల‌తో పాటు అన్ని వ‌ర్గాల్లో అంతో ఎంతో మంచి ఒపీనియన్ ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా జేఏసీని అలాగే కొన‌సాగిస్తూ..చివ‌రికి తెలంగాణ జ‌న‌స‌మితి పేరుతో పొలిటిక‌ల్ పార్టీని పెట్టారు. టీజేఎస్‌ను ఇండిపెండెంట్‌గా నడపకుండా ఆయన కాంగ్రెస్‌కు మ‌ద్దతివ్వడంపైనే అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైంది.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల్లో పోటీ చేసిన టీజేఎస్ ఆ త‌ర్వాత కాంగ్రెస్‌కు కాస్త దూరమైంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యత‌లు చేప‌ట్టిన త‌ర్వాత మ‌ళ్లీ కాంగ్రెస్‌కు ద‌గ్గరైయ్యారు కోదండరాం. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా కాంగ్రెస్‌కు ఔట్‌రైట్‌ సపోర్ట్ చేశారు. అధికారంలోకి వ‌స్తే.. టీజేఎస్‌కు ప్రభుత్వంలో ప్రాధాన్యత క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేద‌ని టీజేఎస్ నేతలు గుర్రుగా ఉన్నారట.

ఈ ఎమ్మెల్సీ పోస్ట్‌పై మొద‌టి నుంచి వివాదమే..

టీజేఎస్ అధినేత ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించారు. ఈ ఎమ్మెల్సీ పోస్ట్‌పై మొద‌టి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా పోయింది. పెద్ద మ‌నిషిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న కోదండ‌రాంకు వివాదంలో ఉన్న ప‌ద‌వి ఇచ్చి కాంగ్రెస్ అన్యాయం చేసిందని క్యాడ‌ర్ గుర్రుగా ఉందట.

ప్రభుత్వంలో భాగ‌స్వామిని చేసేలా కోదండ‌రాంకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నుకుంటే..ఉన్న ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా పోయిందని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నార‌ట‌. కోదండ‌రాంను అన‌వ‌స‌రంగా వివాదంలోకి లాగేలా చేశార‌ని మండిప‌డుతున్నారట. ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌ల్లే బీఆర్‌ఎస్‌కు కోదండ‌రాం మ‌రింత కంటు కావాల్సి వచ్చిందని..అలా కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే ఈ పర‌స్థితి వ‌చ్చేది కాదంటున్నారట.

కాంగ్రెస్‌కు మద్దతివ్వడమే పెద్ద మిస్టేక్‌..

అయితే తెలంగాణ జ‌న స‌మితికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. కోదండ‌రాం సీఎంను కలిసినా ఇప్పటి వ‌ర‌కు అడుగు ముందుకు ప‌డ‌టం లేదట. పైగా తమ అధ్యక్షుడి పోస్టే ఊస్ట్ అయిందని.. ఇక కాంగ్రెస్‌లో తమకు పదవులు దక్కడం కష్టమని భావిస్తున్నారట టీజేఎస్ కార్యకర్తలు. ఓ రకంగా కాంగ్రెస్‌ చేతిలో కోదండరాం మోసపోయారని కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారట.

జేఎసీ ఛైర్మన్‌గా ఎంతో పేరున్న కోదండరాం కాంగ్రెస్‌కు మద్దతివ్వడమే పెద్ద మిస్టేక్‌ అని..పైగా వివాదంలో ఉన్న పోస్ట్‌ తీసుకుని కూడా రాంగ్‌ స్టెప్ వేశారని అనుకుంటున్నారట. ఇప్పటికే కాంగ్రెస్‌లో పదవుల కోసం ఫైటింగ్‌ నడుస్తుంటే ఇక తమకు తమ అధ్యక్షుడికి పదవులు దక్కేదెప్పుడని నిరాశలో ఉన్నారట. తెలంగాణ జనసమితి నేతలు, అధ్యక్షుడు కోదండరాం భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read: పింక్‌ బుక్‌ని రెడీ చేసుకుంటున్న బీఆర్ఎస్? గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నారు..